“ప్రపంచం మొత్తం అనిశ్చితితో నిండిన ఈ పరిస్థితుల్లో భారత్‌ను ఒక స్థిరమైన, విశ్వసనీయమైన విలువ గొలుసు భాగస్వామిగా చూస్తున్నారు. ప్రజాస్వామ్యం బలంగా ఉన్న దేశం, దీర్ఘకాలిక వృద్ధి సాధించగల ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందుతోంది” అని ఆయన చెప్పారు. “ప్రతి సమావేశంలో, ప్రతి ప్యానెల్‌లోనూ ఒకే మాట వినిపించింది – ఈ రోజు ప్రపంచానికి భారత్ ఒక బ్రైట్ స్పాట్” అని మంత్రి వివరించారు.
రాబోయే ఐదేళ్లలో భారత్ ఆర్థిక వృద్ధి ఆరు నుంచి ఎనిమిది శాతం (రియల్ టర్మ్స్‌లో), నామినల్ పరంగా పది నుంచి పదమూడు శాతం వరకు ఉంటుందని అంచనా వేశారు అశ్వినీ వైష్ణవ్. మోస్తరు ద్రవ్యోల్బణం, బలమైన వృద్ధి మద్దతుతో భారత్ స్థిరంగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ), ఈవై సంయుక్తంగా నిర్వహించిన ‘బెట్ ఆన్ ఇండియా – బ్యాంక్ ఆన్ ద ఫ్యూచర్’ అనే సదస్సులో మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చర్యల వల్ల పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు.
పెట్టుబడుల కోసం ప్రధాన అడ్డంకిగా మారిన అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం గణనీయంగా సులభతరం చేసిందని మంత్రి వివరించారు. టెలికాం టవర్లకు అనుమతులు తీసుకోవడానికి ఒకప్పుడు సగటున 270 రోజులు పట్టేదని, ఇప్పుడు అది కేవలం ఏడు రోజులకు తగ్గిందని చెప్పారు. అంతేకాదు, 89 శాతం అనుమతులు సున్నా రోజుల్లోనే ఇస్తున్నామని వెల్లడించారు.
“మన ఉద్దేశాలు, ఆచరణ మధ్య గ్యాప్ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. పాలసీలు కాగితాల మీదే కాకుండా నేలమీద కూడా అమలవ్వాలి” అని ఆయన అన్నారు. పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యలను పరస్పరం పంచుకోవాలని, డేటా లోకలైజేషన్ నిబంధనలను అమెరికా, యూరప్‌లతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
భారత్ 60 ఏళ్ల తర్వాత సెమీకండక్టర్ పరిశ్రమలో కీలక అడుగు వేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లు పైలట్ ప్రొడక్షన్ ప్రారంభించాయని, వాటిలో ఒక ప్లాంట్ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించనుందని చెప్పారు. రేర్ ఎర్త్ ఖనిజాల విషయంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అమెరికా, యూరప్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలతో కలిసి పనిచేస్తూ, ఒక సమగ్ర ఈకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు.
భారత్ వృద్ధికి నాలుగు ప్రధాన స్థంభాలు ఉన్నాయని ఆయన వివరించారు. భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు, సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా చర్యలు, తయారీ రంగం, ఇన్నోవేషన్‌పై దృష్టి, పాలనలో సరళీకరణ, నియమ నిబంధనల సులభీకరణ అని చెప్పారు. “ఈ అన్ని చర్యలతో వచ్చే ఐదేళ్లలో భారత్ 95 శాతం విశ్వాసంతో వేగంగా ఎదుగుతుందని చెప్పగలం. పేదల భద్రత మా ప్రధాన ప్రాధాన్యం” అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ ఏఐ పరిశ్రమ కూడా భారత్ తీసుకుంటున్న విధానాన్ని ప్రశంసిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత కృత్రిమ మేధ మిషన్‌కు ఐదు ప్రధాన స్థంభాలు ఉన్నాయని చెప్పారు.

More Stories
సుంకాల జాబితా నుండి పప్పుధాన్యాలు తొలగింపు
రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి
పార్లమెంటులో ప్రధాని మోదీ సీటు వద్ద ఏం జరిగింది?