అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన వెంటనే, సభలో జరిగిన పరిణామాల వివరాలతో తమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ ఓ మీడియా ప్రకటన విడుదల చేసింది. ‘సభలో పదేపదే గవర్నర్ ఆర్ఎన్ రవి మైక్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. ఆయనను మాట్లాడనివ్వలేదు. దళితులపై దాడులు, దళిత మహిళలపై లైంగిక హింసాకాండ వంటి వ్యవహారాలను గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చలేదు’ అని గవర్నర్ కార్యాలయం విమర్శించింది.
రాష్ట్ర ప్రభుత్వం తప్పులతడకగా ఉన్న ప్రసంగాన్ని తయారుచేసి గవర్నర్‌కు ఇచ్చిందని, అందుకే ఆయన ప్రసంగించేందుకు నిరాకరించారని స్పష్టం చేసింది. తమిళనాడుకు రూ.12 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులు వచ్చాయనే అంశాన్ని ప్రసంగంలో రాశారని, అది వాస్తవదూరమైన అంశమని పేర్కొంది. మరోసారి తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని లోక్‌భవన్ పేర్కొంది.
ప్రాథమిక రాజ్యాంగ విధిని అసెంబ్లీ స్పీకర్ అమలు చేయలేదని తెలిపింది. ఈ కారణాల వల్లే అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారని వెల్లడించింది. అయితే హౌజ్‌లో కేవలం ఎమ్మెల్యేలు మాత్రం తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని, మరెవరికీ ఆ అవకాశం లేదని స్పీకర్ అప్పవు పేర్కొన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ సంస్కృతి, సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభంలో గవర్నర్ ప్రసంగించాలనే సంప్రదాయానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదవాల్సి ఉంటుందని, అందులో ఆయన అభిప్రాయాలను చేర్చే అవకాశమే ఉండదని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు.

More Stories
అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు ఓం బిర్లా గైరాజర్!
పార్లమెంటులో ప్రధాని మోదీ సీటు వద్ద ఏం జరిగింది?
కాంగ్రెస్ నేతలపై సీఎం హిమంత బిశ్వ శర్మ రూ.500 కోట్ల దావా