బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల తర్వాత ముంబై మేయర్ పదవిపై అధికార మహా యుతి కూటమిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, మేయర్ పదవిని మొదటి సంవత్సరానికి తమ పార్టీకి కేటాయించాలని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ముంబైలో బీజేపీ, శివసేన సంయుక్త బలం 118గా ఉంది, ఇది మెజారిటీ మార్క్ అయిన 114 కంటే నాలుగు ఎక్కువ.
జనవరి 23న పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే శతజయంతి అని, మొదటి సంవత్సరంలో శివసేన మేయర్‌ను నియమించడం బాలాసాహెబ్‌కు నివాళిగా ఉంటుందని శివసేన వాదిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రతీకాత్మక చర్య తమ వారసత్వానికి, కూటమి స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుందని పార్టీ భావిస్తోంది. గతంలో, మేయర్ పదవీకాలాన్ని సమానంగా చేరి రెండేళ్లుగా విభజించాలని శివసేన కోరింది.
అయితే, ఈ డిమాండ్‌ను బిజెపి అంగీకరించే అవకాశం లేదని గ్రహించిన తర్వాత, పార్టీ తన వైఖరిని సవరించుకుని, మొదటి సంవత్సరానికి మాత్రమే తన వాదనను పరిమితం చేసింది. కేంద్రంలో, మహారాష్ట్రలో రాజకీయంగా సవాలుతో కూడిన సమయాల్లో బీజేపీకి తాము అందించిన మద్దతును కూడా శివసేన గుర్తు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బాల్ థాకరే 100వ జయంతిని దృష్టిలో ఉంచుకుని, మొదటి సంవత్సరానికి శివసేన మేయర్ పౌర సంస్థకు నాయకత్వం వహించాలని, ఆ తర్వాత మిగిలిన నాలుగు సంవత్సరాలకు బీజేపీ ఆ పదవిని చేపట్టవచ్చని పార్టీ ప్రతిపాదించింది. మరోవంక, ముంబై బీజేపీ తన కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను రాబోయే 10 రోజుల పాటు నగరాన్ని విడిచి వెళ్లవద్దని కోరింది.
అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రయాణించాల్సి వస్తే, ముందుగానే పార్టీ సీనియర్ నాయకులకు తెలియజేయాలని కార్పొరేటర్లకు సూచించారు. రాబోయే మేయర్ ఎన్నికల దృష్ట్యా ఈ ఆదేశం జారీ చేశారు. ఈ ప్రక్రియకు సుమారు ఎనిమిది నుండి పది రోజులు పట్టవచ్చని అంచనా. ముందుజాగ్రత్త చర్యగా, మేయర్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ కార్పొరేటర్లందరూ ముంబైలో ఉండేలా బీజేపీ నిర్ధారించుకోవాలనుకుంటోందని వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం బీజేపీకి 89 మంది కార్పొరేటర్లు ఉండగా, శివసేనకు 29 మంది ఉన్నారు. 227 మంది సభ్యులున్న బీఎంసీలో బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన సంఖ్యా బలం ఉంది. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన ముగ్గురు కార్పొరేటర్లను కూడా కలిపితే ఈ సంఖ్య 121కి చేరుకుంటుంది.
ముంబై బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన పార్టీకి చెందిన వారే మేయర్ ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ షిండే సేన మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. తానే అసలైన శివసేన అని నిరూపించుకోవడానికి ఏక్నాథ్ షిండే తన పార్టీకే మేయర్ పదవి ఇవ్వాలని బీజేపీపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు తమ పార్టీకి చెందిన కార్పొరేటర్ ఎప్పుడూ ముంబై మేయర్ కాలేదని, ఈసారి ఆ అవకాశం తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది.

More Stories
ఏఆర్ రెహ్మాన్ మనోవేదనను తప్పుబట్టిన తస్లిమా
సామూహిక అత్యాచార బాధితురాలి మృతితో మణిపూర్ లో ఉద్రిక్తత
గాజా శాంతి మండలిలోకి భారత్‌ను ఆహ్వానించిన ట్రంప్