ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్ రిపబ్లిక్ చుట్టూ తన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నది. అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణించే అణు శక్తి సామర్థ్యమున్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియా వైపు పయనమైనట్లు తెలుస్తున్నది.
ప్రపంచంలోనే అతి పెద్దది, అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకల్లో ఒకటైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికా నౌకాదళంలో కీలకపాత్ర పోషిస్తున్నది. ఇరాన్ గగనతలం మూతపడిన సరిగ్గా గంట తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికన్ న్యూస్ వెబ్సైట్ నేషన్ వార్తాకథనం పేర్కొన్నది. చైనా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అక్కడి నుంచి పశ్చిమాసియా వైపు బయల్దేరినట్లు పత్రికా కథనం పేర్కొంది.
అది పశ్చిమాసియాను చేరుకోవడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. అయితే అమెరికా అధికారులు మాత్రం ఈ సమాచారాన్ని ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. కాగా, వెనెజువెలాపై సైనిక దాడి జరపడానికి ముందు అమెరికా ఇదే రకమైన పంథాను ఎంచుకుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ దక్షిణ చైనా సముద్రం నుంచి సెంట్రల్ కమాండ్ ప్రాంతంలోకి పయనమైనట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వెబ్సైట్ వైట్ మౌస్ విలేకరి కెల్లీ మేయర్ వెల్లడించారు.
పశ్చిమాసియా, ఈశాన్య ఆఫ్రికా, మధ్య ఆసియా, దక్షిణాసియాలోని 21 దేశాలు సెంట్రల్ కమాండ్ ప్రాంత పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ నౌకలేవీ మోహరించి లేవు. దక్షిణ చైనా సముద్రంలో సాధారణ నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌకలో 3-6 విధ్వంసక క్షిపణులు, 1-2 జలాంతర్గాములు, 7,000-8000 మంది సైనిక సిబ్బంది, 65-70 యుద్ధ విమానాలు(ఎఫ్-35, ఎఫ్/ఏ-18) మొదలైనవి ఉన్నాయి.
మరో పక్కన పశ్చిమాసియాలోని తన సైనిక స్థావరాల నుంచి సిబ్బందిని తరలించే ప్రక్రియను అమెరికా మొదలుపెట్టింది. దాదాపు 10,000 మంది సైనిక బలగాలతో పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా స్థావరమైన ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరం నుంచి కొంతమంది సిబ్బందిని బుధవారం సాయంత్రానికి తరలించివేయాలని అమెరికా ఆదేశించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. ఇది పూర్తిగా తరలింపు కాదని, బలగాల్లో మార్పులు మాత్రమేనని అమెరికా అధికారి ఒకరు వివరించారు.
More Stories
బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య
ఇరాన్లో సమాచార వ్యాప్తిని అడ్డుకొంటున్న ఇంటర్నెట్ బ్లాక్అవుట్
గ్రోక్లో అసభ్య చిత్రాలు.. ఎలాన్ మస్క్‌పై మాజీ లవర్ దావా