“రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పని అయిపోయింది. ఇంకా ఎక్కడ ఉంది?” అది కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా చేతిలో పెట్టారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఘోరంగా ఓటమి చవి చూసిందని, తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదని ఆయన తెలిపారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, ఇంకా బిఆర్‌ఎస్ ఎక్కడ ఉందని కేంద్ర మంత్రి ఎదురు ప్రశ్నించారు. బురఖా ధరించిన మహిళ దేశానికి ప్రధాని కావాలన్నదే తన ఆకాంక్ష అని మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. పాక్, బంగ్లాదేశ్‌కు వెళ్ళి హిందూ మహిళలను ప్రధానిగా చేయాలని అక్కడ డిమాండ్ చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా, పటిష్టంగా అమలు చేయడానికి ‘వికసిత్ భారత్ జి రామ్ జి’గా పేరు మార్చడం జరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు. దీనిని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని పేర్కొన్నారు.
పైగా ఈ పథకం కింద గతంలో 100 రోజుల పని దినాలు ఉంటే ఇప్పుడు 125 రోజులకు పెంచడం జరిగిందని ఆయన చెప్పారు. పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. 40 శాతం నిధులు రాష్ట్రమే భరించాలన్న నియమం ఉండడం వల్ల ఎదురయ్యే సమస్య గురించి ప్రశ్నించగా, భారంగా భావించరాదని, పేదలపై ప్రేమ ఉంటే బాధ్యతగా తీసుకుని పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరించాలని ఆయన సూచించారు.
విబి జి రామ్ జి పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన తెలిపారు. అధికారుల జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన చెప్పారు. పైగా రాజకీయ రంగు పులుముతున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రతి రాష్ట్రం తన అవసరాలకు అనుగుణంగా, ఆ రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఈ పథకాన్ని ఏ సమయాల్లో అమలు చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు.

More Stories
‘మానస’ లో వృత్తి నైపుణ్యాల ద్వారా దివ్యాంగుల సాధికారత
విబి-జి రామ్ జి చట్టం పారదర్శకతకు ప్రతీక
కట్టమైసమ్మ దేవి ఆలయం సమీపంలో మలవిసర్జనతో ఉద్రిక్తత