ఢిల్లీ అల్లర్ల కేసు విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ కు మద్దతుగా అమెరికాలోని న్యూయార్క్ కొత్త మేయర్ జొహ్రాన్ మమ్దానీ లేఖ రాయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల న్యాయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి బదులు సొంత బాధ్యతలపై దృష్టి సారించాలని హితవు చెప్పింది. ఈ విషయమై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర జైశ్వాల్ ఘాటుగా స్పందిస్తూ ఇతర దేశాల న్యాయ వ్యవస్థను గౌరవించాలని సూచించారు.
జొహ్రాన్ మమ్దాన ఇటీవలే న్యూయార్క్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇదే సమయంలో అక్కడ ఉమర్ ఖలీద్ తల్లిదండ్రుల్ని కలిశాడు. అంతకుముందే ఉమర్ ఖలీద్ కు మద్దతుగా ఒక లేఖ రాశాడు. ఉమర్ మాటలు ఇతరులకు చేదుగా అనిపించవచ్చని, కొంతమంది వాటిని జీర్ణించుకోలేరని లేఖలో పేర్కొన్నాడు. ఉమర్ తల్లిదండ్రుల్ని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఈ లేఖకు సంబంధించిన ఫొటోను ఉమర్ ఫ్రెండ్ బానోజ్యోత్స్న సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే లేఖను ఉమర్ తల్లిదండ్రులకు మామ్దానీ అందించారు.
అయితే, ఈ అంశంపై స్పందిస్తూ ఒక దేశానికి చెందిన ప్రజాప్రతినిధులు ఇతర దేశాల్లో స్వేచ్ఛగా పనిచేసే న్యాయ వ్యవస్థను గౌరవించాలని, వ్యక్తిగత అభిప్రాయాలు తమ అధికారంలోకి తీసుకురాకూడదని రణధీర్ సూచించారు. అలాగే ఇలాంటి వాఖ్యలు చేసే బదులు ప్రజా ప్రతినిధులు తమ సొంత బాధ్యతల్ని నెరవేర్చడంపై దృష్టి సారించాలని మామ్దానీకి సూచించారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ఇటీవలే ఉమర్ ఖలీద్ కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే.

More Stories
టీఎంసీ, ఈడీ న్యాయవాదుల మధ్య కోర్టులో తోపులాట
శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్
అమిత్ షా కార్యాలయం ఎదుట టీఎంసీ నిరసన