ఐప్యాక్ ఆఫీసుల్లో ఈడీ దాడుల సమయంలో మమతా ప్రత్యక్షం

ఐప్యాక్ ఆఫీసుల్లో ఈడీ దాడుల సమయంలో మమతా ప్రత్యక్షం
గురువారం జరిగిన నాటకీయ సంఘటనలలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడి చేస్తున్న ఇంట్లోకి అకస్మాత్తుగా ప్రవేశించారు.  వారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినతమ పార్టీ అంతర్గత డేటా – హార్డ్ డిస్క్‌లు, అభ్యర్థుల జాబితాలు, వ్యూహాలను  ‘తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
 
ఉదయం నుండి ఈడీ బృందాలు కోల్‌కతా, బిధాన్‌నగర్‌లోని పలు ప్రదేశాలలో దాడులు ప్రారంభించాయి. వీటిలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్‌ తో సంబంధం ఉన్నవి ఉన్నాయి. ఈ సోదాలు సాల్ట్ లేక్ భవనంలోని 11వ అంతస్తులోని  ఐప్యాక్‌ కార్యాలయం, దాని అధిపతి ప్రతీక్ జైన్ లౌడాన్ స్ట్రీట్ నివాసం, బుర్రాబజార్‌లోని పోస్టాలోని ఒక వ్యాపారి కార్యాలయం ఉన్నాయి. 
 
కాగా, కోల్‌కతా పోలీసు కమిషనర్ మనోజ్ వర్మ ఆ ప్రదేశానికి చేరుకున్న కొద్ది నిమిషాల తర్వాత, మధ్యాహ్నం సమయంలో ఆమె ప్రతీక్ జైన్ నివాసంలోకి అకస్మాత్తుగా దూసుకెళ్లారు. ఆమె దాదాపు 20 నుండి 25 నిమిషాల పాటు అక్కడే ఉండి, కీలకమైన పార్టీ పత్రాలు ఉన్నాయని పేర్కొన్న ఆకుపచ్చ ఫోల్డర్‌ను తీసుకుని ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయారు. 
 
తన పార్టీ ఫైలును సేకరించానని పేర్కొంటూ, ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకలాపాలు,  ప్రణాళికల వివరాలను ఈడీ పొందడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “వారు అభ్యర్థుల జాబితా, మా అంతర్గత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఈడీ, అమిత్ షా విధినా? చూడండి, నాకు ఇది వచ్చింది, ఫైల్, హార్డ్ డ్రైవ్,” ఆమె తన చేతిలో ఉన్న ఆకుపచ్చ ఫోల్డర్‌ను చూపిస్తూ చెప్పారు.
 
ఐప్యాక్‌  కేవలం టీఎంసీతో కన్సల్టెన్సీ పని కోసమే కాకుండా, ఆ పార్టీ ఐటీ, మీడియా కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తుంది.  ప్రతీక్ తన పార్టీకి ఇన్‌ఛార్జ్ అని చెబుతూ వారు తమ పార్టీ  సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది చట్టాన్ని అమలు చేయడం కాదు, రాజకీయవేధింపు చర్యలు అని ఆమె మండిపడ్డారు.
 
ఇలా ఉండగా, బిజెపి నాయకుడు, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఐప్యాక్‌ ఒక కార్పొరేట్ సంస్థ అని, కానీ పార్టీ కార్యాలయం కాదని పేర్కొంటూ అక్కడ పార్టీ పాత్రలను ఎందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తులో జోక్యం చేసుకున్నందుకు మమతపై ఈడీ  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, కోల్‌కతా పోలీస్ కమిషనర్ చేసినది రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.