అజ్ఞానమనే చీకటిని తొలగించే వాడే గురువు

అజ్ఞానమనే చీకటిని తొలగించే వాడే గురువు
అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడే గురువని యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద చెప్పారు. భగవంతుడి నిశ్శబ్ద స్వరమే గురువని తెలిపారు. సాధన అంటే దయ, క్షమ, సేవా తత్పరత అలవరచుకోవడమేనని పేర్కొన్నారు.  వై ఎస్ ఎస్ ఆధ్వర్యంలో తిరుపతి నలందా నగర్ లో నూతన ధ్యాన మందిరాన్ని స్వామి స్మరణానంద ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ ఎవరైతే భగవంతుడిని కోరుకుంటారో వారినే దేవుడు ఎంచుకుంటారని చెప్పారు.  తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో వైఎస్ ఎస్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించుకోవడం ముదావహమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ధ్యాన మందిర నిర్మాణానికి తొడ్పడిన భక్తులు, దాతల కృషిని కొనియాడారు.
ధ్యాన మందిరంలో నిరంతర సత్సంగం, సాధనల ద్వారా భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  మరోవైపు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా యోగదా ధ్యాన పద్ధతులపై శిక్షణ, సామూహిక ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, క్రియాయోగ దీక్షలు ఉంటాయి.