కోనసీమలో బ్లో ఔట్‌.. ఎగిసిపడుతున్న మంటలు

కోనసీమలో బ్లో ఔట్‌.. ఎగిసిపడుతున్న మంటలు
 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ సమీపంలోని ‘మోరి ఫీల్డ్‌-5’లో సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ బ్లో ఔట్‌… ఒకప్పటి పాశర్లపూడి ‘బ్లోఔట్‌’ను గుర్తుకు తెస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి పిల్లాపాపలతో పరుగులు తీశారు. ఇరుసుమండ గ్రామంలోని ఈ ప్రదేశంలో 1993లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ నిర్వహించింది. ఆ తర్వాత ఈ బావిని వదిలేసింది.
అయితే ఈ బావిని ఓఎన్జీసీ సంస్థ 2024లో డీప్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు సబ్‌లీజుకు ఇచ్చింది. ఇక్కడ ‘వర్క్‌ ఓవర్‌ రిగ్‌తో’ ఆ సంస్థ అన్వేషణ చేపట్టి ఈ బావిలో అపార చమురు, గ్యాస్‌ నిక్షేపాలున్నట్టు గుర్తించించింది.  ఈ క్రమంలో గతంలోనే డ్రిల్లింగ్‌ పూర్తయిన ఈ బావిలో సోమవారం మరింత లోతుగా 2.7 కిలోమీటర్లు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అధిక ఒత్తిడితో గ్యాస్‌ విస్ఫోటం సంభవించింది. సుమారు అరగంట తర్వాత మరో విస్ఫోటంతో భారీ శబ్ధాలతో మంటలు చెలరేగాయి.
ఈ మంటలు వంద అడుగుల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి.  దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయకంపితులై ఇళ్లను ఖాళీ చేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. భూగర్భ పొరల్లో 30 నుంచి 40 మిలియన్‌ టన్నుల గ్యాస్‌, చమురు నిల్వలు ఉన్నట్టు అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. ప్రస్తుతం డ్రిల్లింగ్‌ సైట్‌ వద్ద మంటలు వంద అడుగుల ఎత్తు, 25 మీటర్ల వ్యాసార్థంతో ఎగసిపడుతున్నాయి. 

దీంతో సైట్‌ వద్ద ఉన్న వాహనాలు, రిగ్‌ పరికరాలు కాలి బూడిదవుతున్నాయి. కొబ్బరిచెట్లు, పంటపొలాలు బుగ్గిపాలవుతున్నాయి. బావిలో భారీగా చమురు, సహజవాయు నిక్షేపాలు ఉన్నందున ప్రస్తుతం ఈ భారీ బ్లో ఔట్‌ను అదుపు చేయడం కష్టమేనని ఓఎన్జీసీ భావిస్తోంది. పైపులైను వ్యవస్థ కూలిపోవాలి లేదంటే మొత్తం గ్యాస్‌ రిజర్వాయర్‌ మండి పీడనం తగ్గితే తప్ప దీన్ని అరికట్టలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కాగా మంటలను అదుపు చేసేందుకు ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ప్రధాన పంట కాల్వ నుంచి నీటిని వెదజల్లే ప్రక్రియను అధికారులు చేపట్టారు. మరో 24 గంటల్లో ఈ బ్లో ఔట్‌ అదుపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కోనసీమ జిల్లా కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు.  బ్లో ఔట్‌ నియంత్రణకు చర్యలు చేపట్టినట్టు ఓఎన్జీసీ సోమవారం ప్రకటించింది. అవసరమైతే ఈ బావిని మూసివేస్తామని స్పష్టం చేసింది.

మోరి-5 జీసీఎస్‌ పరిధిలో డీప్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ పీఈసీ ఆపరేటర్‌గా ఉన్నారని, వాళ్లే ఇక్కడ గ్యాస్‌ లీకేజీ సమాచారం తమకు తెలియజేశారని పేర్కొంది. బ్లోఅవుట్‌ జరిగిన ప్రాంతానికి కిలోమీటరు పరిధిలోని వారందరినీ తొలుత సురక్షిత ప్రాంతాలకు తరలించారు.