దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుంది

దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుంది

దేశంలో ‘వైట్ కాలర్’ ఉగ్రవాదం పెరుగుతున్న ధోరణి ఆందోళన కలిగిస్తోందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తెలిపారు. అత్యంత విద్యావంతులైన కొందరు సమాజానికి, దేశానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో భూపాల్ నోబుల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. 

గతేడాది నవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడును ప్రస్తావిస్తూ వైట్ కాలర్ ఉగ్రవాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. జ్ఞానంతో పాటు విలువలు, నైతికత ఎంత అవసరమో ఆ ఘటన తెలియజేస్తుందని చెప్పారు. రోగులకు ప్రిస్క్రిప్షన్‌పై ‘ఆర్ఎక్స్’ అని రాసే వైద్యుల చేతుల్లో ‘ఆర్డిఎక్స్’ ఉండటం దురదృష్టకరమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలోని డిఫెన్స్ స్టార్టప్‌లు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయని చెబుతూ రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఆయుధాల తయారీలో భారత్ పూర్తి స్వయం సమృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 
“వైట్-కాలర్ ఉగ్రవాదం అనే ఆందోళనకరమైన ధోరణి ఈ రోజు దేశంలో పెరుగుతోంది. అత్యంత విద్యావంతులైన వారిలో కొందరు సమాజానికి, దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మీరు చూశారు. దిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అది చేసింది ఎవరు ఓ వైద్యుడు. రోగులకు ప్రిస్క్రిప్షన్‌ పైన ఆర్‌ఎక్స్ రాసిన తర్వాత వైద్యులు మందులు రాస్తారు. ఐతే కొందరి వైద్యుల చేతుల్లో ఆర్‌డీఎక్స్ ఉంది. జ్ఞానంతో పాటు సంస్కారం కూడా ఉండాలి” అని రక్షణ మంత్రి తెలిపారు. “విద్య ఉద్దేశం కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదు, నైతికత, నీతి, మానవ వ్యక్తిత్వ వికాసం కూడా. నవంబర్ 10న ఎర్రకోట వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. ఈ పేలుడుకు కారణమైన ఐ20 కారులను డాక్టర్ ఉమర్ ఉన్ నబీ నడిపాడు. ఈ కేసు దర్యాప్తులోనే వైట్-కాలర్ ఉగ్రవాద ముఠా గురించి తెలిసింది. దీని ఫలితంగా ముజమ్మిల్ గనాయ్, అదీల్ రథర్, షహీనా సయీద్ అనే ముగ్గురు వైద్యులతోపాటు, మరికొందిరిని అరెస్టు చేశారు” అని రాజ్నాథ్ వివరించారు.