తెలంగాణ పోలీసులకు చిక్కిన కీలక నేత బర్సే దేవా

తెలంగాణ పోలీసులకు చిక్కిన కీలక నేత బర్సే దేవా
మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేత, మావోయిస్టు పార్టీ ఏకైక బెటాలియన్​ కమాండర్ బర్సె దేవా అలియాస్ సుక్కాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం వెలువడింది. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వారంతా దేవా నేతృత్వంలోని బెటాలియన్​కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై రూ.50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి గతంలో పనిచేసిన వ్యక్తిగా దేవాను గుర్తించారు. ఆయన పాత్ర పలు కీలక ఘటనలతో ముడిపడి ఉన్నట్టు సమాచారం. ఈ ఆపరేషన్‌లో దేవాతో పాటు మరో 15 మంది వరకు కూడా పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. వీరంతా మావోయిస్టు నెట్‌వర్క్‌కు సంబంధించినవారేనా? లేక అనుబంధ వ్యక్తులా? అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీకి ఉన్న కీలకమైన త్రయంలో దేవా కూడా ఒకరు. పార్టీ చీఫ్​ తిప్పిరి తిరుపతి ఎలియాస్​ దేవ్​జీ, తెలంగాణ పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్​ దామోదర్​తో పాటు దేవా ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ ఉన్నారు. కొద్దిరోజుల క్రితం మారేడుమిల్లిలో జరిగిన ఎన్​కౌంటర్​లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ఆయన సమకాలికుడు.

వయసులో హిడ్మా కంటే వారం రోజులు చిన్నవాడు మాత్రమే. దేవాది కూడా ఛత్తీస్​గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని హిడ్మా స్వస్థలమైన పువర్తి గ్రామం. ఇంచుమించు ఇద్దరూ ఒకేసారి మావోయిస్టు పార్టీలో చేరగా, పార్టీ బెటాలియన్ కార్యకలాపాల్లో వీరిరువురు కీలకంగా వ్యవహరించారు.

మావోయిస్టు పార్టీ సెంట్రల్​ మిలిటరీ కమిషన్​కు (సీఎంసీకి) వెన్నెముకగా నిలిచిన పీఫుల్స్​ లిబరేషన్​ గెరిల్లా ఆర్మీ (పీఎల్​జీఏ) కార్యకలాపాలు దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది. హిడ్మా మృతితో పీఎల్​జీఏ మిన్ను విరిగినట్లు అవగా, దేవా చిక్కడంతో ఇక అది కనుమరుగైనట్లే అనే అభిప్రాయం కలుగుతోంది. వాస్తవానికి మావోయిస్టు పార్టీ ఆపరేషన్లకు పీఎల్​జీఏనే కీలకంగా వ్యవహరించింది.