అవామీ లీగ్‌ పార్టీపై యూనస్‌ ప్రభుత్వం నిషేధం

అవామీ లీగ్‌ పార్టీపై యూనస్‌ ప్రభుత్వం నిషేధం
బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాగ్రహానికి జడిసి దేశం విడిచి పారిపోయిన పదవీచ్చుత ప్రధాన మంత్రి షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అవామీ లీగ్‌పార్టీ కోల్పోయింది. 
 
మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ తాత్కాలిక చైర్మన్‌ తారిక్‌ రెహమాన్‌ దాదాపు 17 ఏండ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన వేళ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ తాత్కాలిక చైర్మన్‌ తారిక్‌ రెహమాన్‌ ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టారు.  ఈ సందర్భంగా రెహమాన్, అతని కుటుంబ సభ్యులకు ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. 
కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాని రేసులో తారిక్‌ ముందు వరుసలో ఉన్నారు. ఖలీదా జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా తారిక్ రహమాన్‌ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
 
కాగా, మహమ్మద్ యూనస్ కు ప్రత్యేక సహాయకుడిగా పని చేస్తున్న ఎండీ ఖుదా బక్ష్ చౌదరి హోం మంత్రిత్వ శాఖలోని తన హోదా, స్టేట్ మినిస్టర్ హోదాతో కూడిన బాధ్యతల నుండి రాజీనామా చేశారు.  మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన ఆయన సుమారు ఏడాది కాలం పాటు ఆయన హోం మంత్రిత్వ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. దేశంలో శాంతి, భద్రతా వ్యవస్థను పర్యవేక్షించారు.