ఐపీఎస్ సునీల్ కుమార్ బర్తరఫ్ కై రఘురామ డిమాండ్!

ఐపీఎస్ సునీల్ కుమార్ బర్తరఫ్ కై రఘురామ డిమాండ్!
తనపై, తన కుటుంబంపై, రాజ్యాంగబద్ధ హోదాపై ఆన్‌లైన్ వీడియోల ద్వారా దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రాష్ట్ర డీజీపీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సివిల్ సర్వెంట్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సరికాదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోల ద్వారా వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా, పదవుల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని డిప్యూటీ స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అధికార దుర్వినియోగం ఆరోపణలపై సస్పెన్షన్ కు గురైన సునీల్ కుమార్, గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా రఘురామ కృష్ణరాజును నిర్బంధంలో చిత్రహింసలకు గురిచేసిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ వ్యవహారంలో సివిల్ సర్వీస్ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారని పేర్కొంటూ, ఐపీఎస్ సునీల్ కుమార్‌పై డిస్మిసల్ ప్రొసీడింగ్స్‌ను వెంటనే ప్రారంభించాలని రఘురామకృష్ణరాజు డీజీపీని కోరారు. సేవా నియమాలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిష్పక్షపాతత్వం, పరిమితి, గౌరవాన్ని ఆశిస్తాయని, అవి అతిక్రమితమైతే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.

ప్రభుత్వ అధికారుల మాటలు ప్రజల్లో నమ్మకాన్ని ప్రభావితం చేస్తాయని, కాబట్టి సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని ఫిర్యాదులో ఆయన స్పష్టం చేశారు. మరోవంక, ఇపిఎక్స్ సునీల్ కుమార్ తన వాదనలో మరింత తీవ్ర ఆరోపణలు చేశారు. రఘురామకృష్ణరాజుపై రూ.945 కోట్లకు సంబంధించిన అక్రమాల ఆరోపణలు చేస్తూ, త్వరలో అరెస్టు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరస్పర ఆరోపణలతో వ్యవహారం రాజకీయంగానూ, న్యాయపరంగానూ మరింత ఉత్కంఠకు దారి తీస్తోంది.