బంగ్లాదేశ్​లో మరో విద్యార్థి నేతపై కాల్పులు

బంగ్లాదేశ్​లో మరో విద్యార్థి నేతపై కాల్పులు

బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హింసాత్మక దాడులు  కొనసాగుతున్నాయి. యువ విద్యార్థినేత, ఇంక్విలాబ్‌ మంచో సంస్థ ప్రతినిధి ఉస్మాన్‌ హాది హత్య ఘటన మరువక ముందే మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం మరో విద్యార్థినేతపై దాడి జరిగింది. విద్యార్థుల నేతృత్వంలోని నేషనల్‌ సిటిజన్‌ పార్టీ (ఎన్‌సిపి) సీనియర్‌ నేత ముహమ్మద్‌ మోతలేబ్‌ సిక్టార్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. 

ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సోమవారం ఉదయం 11.45 గంటలకు నగరంలోని సొనాదంగ ప్రాంతంలో ఒక ఇంట్లో కాల్పులు జరిగాయని బంగ్లాదేశ్‌ పత్రిక ప్రోథోమ్‌ అలో పేర్కొంది. ముహమ్మద్‌ సిక్దార్‌ పార్టీ  కేంద్ర నిర్వాహకుడు, ఎన్‌సిపి కార్మిక విభాగమైన  జాతీయ శ్రామిక్‌ శక్తి  – ఖుల్నా డివిజన్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని  ఎన్‌సిపి కుల్నా మెట్రోపాలిటన్‌ యూనిట్‌ కార్యనిర్వాహకుడు సైఫ్‌ నవాజ్‌ మీడియాకు తెలిపారు.

ఖుల్నాలో త్వరలో నిర్వహించనున్న కార్మిక ర్యాలీ పనులను పర్యవేక్షిస్తుండగా, ఆయనపై కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. ముహమ్మద్  సిక్దార్‌ తల ఎడమవైపు తుపాకీ గాయమైందని,  ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు.  సిక్దార్‌ను కుల్నా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేర్చామని, చికిత్స అందిస్తున్నట్లు  సొనాదంగ పోలీస్‌స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ (విచారణ) అనిమేష్‌ మండల్‌ తెలిపారు. 

ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. విద్యార్థినేత, ఇంక్విలాబ్‌ మంచ్‌ ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ హాది హత్యతో గతవారం రోజులుగా బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది మాజీ ప్రధాని షేక్‌ హసీనా పదవీచ్యుతికి దారితీసిన ఆందోళనల్లో హాది కీలకంగా వ్యవహరించారు.

ఇదిలా ఉండగా, హాదీపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఫైసల్ కరీం మసూద్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. అతడిపై ప్రయాణ నిషేధాన్ని విధిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోనే ఉన్న మసూద్‌ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తరచూ స్థానాలను మారుస్తున్నాడని భద్రతా సంస్థలు తెలిపాయి. అతడి కదలికలను తెలుసుకోవడానికి బహుళ దర్యాప్తు బృందాలను మోహరించినట్లు పేర్కొన్నాయి.

హాదీ మృతి రోజు రాత్రి నిరసలు చేస్తున్న సమయంలోనే హిందూ వ్యక్తి దీపూ చంద్ర దాస్ దారుణ హత్యకు గురయ్యారు. మైమెన్‌సింగ్ నగరంలో చంద్రదాస్‌ అనే వ్యక్తిని ఒకగుంపు అతణ్ని తీవ్రంగా కొట్టి చెట్టుకు వేలాడదీసి ఉరి తీశారు. అనంతరం రహదారి పక్కన పడేశారు. ఆ తర్వాత మళ్లీ ఇంకొందరు ఆ మృతదేహానికి నిప్పు అంటించారు. ఈ ఘటనపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఈ హత్య కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వెల్లడించారు.