ఆంధ్రప్రదేశ్లో జనాభా సంక్షోభం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (టిఎఫ్ఆర్) ఆందోళనకరంగా పడిపోవడంతో, భవిష్యత్తులో తలెత్తే తీవ్ర పరిణామాలను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్, హంగేరీ వంటి దేశాల్లో అమలు చేస్తున్న తరహాలో ‘రెండో బిడ్డను కనేవారికి’ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
అమరావతిలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో ఈ ఆందోళనకరమైన గణాంకాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ బయటపెట్టారు. జాతీయ సగటు 28.4 ఏళ్లతో పోలిస్తే, ఏపీలో సగటు వయసు 32.5 ఏళ్లుగా ఉందని, ఇది రాష్ట్రం వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తోందనడానికి సంకేతమని ఆయన వివరించారు.
రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కు పడిపోయిందని, ఇది సాధారణంగా ఉండాల్సిన 2.1 కంటే చాలా తక్కువని తెలిపారు.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభాపై ఆధారపడే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు పెద్దపీట వేసిన తాము, ఇప్పుడు జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
“అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యనే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. పనిచేయని వయసు జనాభా పెరుగుతోంది. ఇకపై పిల్లల్ని కనేలా కుటుంబాలను ప్రోత్సహించడంపైనే మన దృష్టి ఉండాలి,” అని సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఫెర్టిలిటీ కాలేజీలు’ ఏర్పాటు చేయనున్నట్లు గౌర్ తెలిపారు.
వీటి ద్వారా సంతానలేని దంపతులకు ప్రభుత్వ సహాయంతో ఐవీఎఫ్ చికిత్స అందించి, జనాభా సుస్థిరతకు దోహదపడతామని చెప్పారు. దీంతో పాటు మహిళల ఉపాధిని ప్రోత్సహించేందుకు కార్యాలయాల్లో తప్పనిసరిగా క్రెచ్ (శిశు సంరక్షణ కేంద్రాలు) ఏర్పాటు చేయడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని 31 శాతం నుంచి 59 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల రాష్ట్ర జీఎస్డీపీ 15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా.

More Stories
ఇంద్రకీలాద్రిపై ‘శ్రీ చక్ర అర్చన’లో పురుగులు ఉన్న పాలు!
పరకామణిలో చోరీ కేసుబలహీనపర్చారు
‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి