హిందూ మతం, దేవాలయాలపై దాడి చేస్తున్న వైఎస్సార్సీపీ

హిందూ మతం, దేవాలయాలపై దాడి చేస్తున్న వైఎస్సార్సీపీ
హిందూ మతం, దేవాలయాలపై దాడి చేయడమే వైఎస్సార్సీపీ పనిగా పెట్టుకుందని మండిపడుతూ ఆ పార్టీ నేతలు హిందువుల పక్షాన ఎప్పుడు నిలబడ్డారో చెప్పాలని ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి నిలదీశారు.  వేంకటేశ్వరస్వామి గురించి మాట్లాడేటప్పుడు ఎంతో భక్తిభావంతో ఉండాలని హైకోర్టు మొట్టికాయలు వేసినా జగన్‌కు బుద్ధి రాలేదని విమర్శించారు. జగన్ తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
పరకామణి చోరీని చిన్న కేసు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందువులంటే వైఎస్సార్సీపీ నేతలకు అంత హీనంగా కనిపస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరస్వామిని కించపరిచేలా జగన్‌ మాట్లాడతారని, ఆయన వ్యాఖ్యలు వింటుంటే గుండె పగిలిపోతోందని మండిపడ్డారు.
 
లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేయించినట్లు డ్రామా ఆడారని శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. గత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కనుసనల్లో ఈ వ్యవహారం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.  ఒక సాధారణ ఉద్యోగి రూ.14.40 కోట్లు ఎలా ఇచ్చారని నిలదీశారు. ఒక సాధారణ ఉద్యోగి రవికుమార్ 14.40 కోట్లు ఇచ్చారంటే అవినీతి ఎంత మొత్తంలో జరిగిందో అర్థం చేసుకోవచ్చని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 
 
జగన్‌కు హిందువులు ఓట్లు వేయలేదా? అని ప్రశ్నించారు. పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాలకు జగన్ ఏనాడు సతీసమేతంగా హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు. జగన్‌మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్‌పై ఏనాడు సంతకం పెట్టలేదని తెలిపారు. 
జగన్‌కు హిందువులు తగిన బుద్ధి చెబుతారని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టినా కూడా జగన్‌కు బుద్ధి రావడం లేదని ధ్వజమెత్తారు. హిందూ మతంపై దాడి చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.