హోంమంత్రి అమిత్ షాతో పివిఎన్ మాధవ్ భేటీ!

హోంమంత్రి అమిత్ షాతో పివిఎన్ మాధవ్ భేటీ!
ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్  లతో కలిసి ఏపీ బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. 

ఈ సందర్భంగా మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన సంక్షేమ పథకాలు, సుపరిపాలన విధానాలను ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తున్న తీరు ప్రజలకు వివరిస్తూ ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు అమిత్ షా కు వివరించారు. దీనితోపాటు ఏపీకి సంబంధించి పలు కీలక అభివృద్ధి అంశాలతో అమిత్ షా తో వారు చర్చించారు.

టీడీపీ, జనసేన నేతలూ ఈ యాత్రలో పాల్గొన్నట్లు తెలపడంతో యాత్రలో కూటమి నేతలు పాల్గొనడం మంచి పరిణామమని అమిత్ షా అభినందించారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నట్లు తెలపడంతో పాటు ఏపీ ఆర్థిక పరిస్థితిపై అమిత్ షా కు వివరాలు అందించారు.  నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ ను మాధవ్, బిజెపి మంత్రులు మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

పార్లమెంట్ భవనంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఏపీలోని పలు స్టేట్ హైవే లను జతీయ రహదారులుగా మార్పు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకు ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ ఆవరణలో ప్రముఖ కథా రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ను కలీశారు.