జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు ఆరు వరాల గడువు

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు ఆరు వరాల గడువు
లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొంటున్న న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా స్పందించేందుకు ఆరు వారాల గడువు లభించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ ఈ గడువును ఇచ్చింది.  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ నేతృత్వంలోని ఈ కమిటీ ఈనెల 5న జరిగిన విచారణలో జస్టిస్‌ వర్మ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నది.
ఆయన ఎనిమిది వారాల అదనపు సమయం కోరగా కమిటీ ఆరు వారాల సమయాన్ని మాత్రమే మంజూరు చేసింది. ఇకపై మరింత గడువు ఉండదని స్పష్టం చేసింది.  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆగస్టు 12న ఈ కమిటీని నియమించిన విషయం విదితమే. జస్టిస్‌ వర్మను తొలగించాలంటూ 146 ఎంపీలు సంతకం చేసిన తీర్మానం ఆధారంగా న్యాయమూర్తుల (విచారణ) చట్టం కింద ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 
 
ఈ విచారణ కమిటీ జస్టిస్‌ వర్మకు ఆరోపణల మెమోతో పాటు ఆధారాలను అందించింది. ఇందులో మార్చి 14-15 రాత్రి జరిగిన అగ్నిప్రమాద సమయంలో ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ సిబ్బంది చిత్రీకరించిన నగదు కాలుతున్న వీడియోలు, ఇన్‌-హౌజ్‌ విచారణలో నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.  ఈ విచారణలో జస్టిస్‌ వర్మ తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు సాక్షులను ప్రవేశపెట్టే, ఆరోపణలకు మద్దతు ఇస్తున్న సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే పూర్తి అవకాశం ఉంటుంది.
విచారణ జనవరి చివరి వారంలో మళ్లీ ప్రారంభం కానున్నది.  తన అధికారిక నివాసంలో కాలిన స్థితిలో లభించిన లెక్కల్లో లేని నగదు ఘటనకు సంబంధించి లోక్‌సభలో ఆయన తొలగింపు తీర్మానాన్ని ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ ఘటన జరిగిన వారంలోనే జస్టిస్‌ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆయనకు న్యాయపరమైన విధులు కేటాయించలేదు.