తెలుగుగడ్డపై భారతరత్న వాజ్‌పేయిది చెరుగని ముద్ర !

తెలుగుగడ్డపై భారతరత్న వాజ్‌పేయిది చెరుగని ముద్ర !
ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు


“ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ అభివృద్ధి కోసం ఎంతో త్యాగం చేశారు. వందేమాతరం ఉద్యమం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం వరకు… ఆంధ్రులు ఎప్పుడూ ముందుంటారు. తెలుగు సాహిత్యం భారతీయ సంస్కృతిలో అపూర్వమైనది. ఆంధ్రప్రదేశ్ అంటే  సంస్కృతి, సాహిత్యం, కళల కేంద్రం.” భారతరత్న  అటల్ బిహారీ వాజపేయి  ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పిన మాటలు ఇవి.  
 
ఉమ్మడి ఆంధ్రపదేశ్ దేశానికి  ఎంత ముఖ్యమో ఆ మహోన్నతుడు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. అందుకే దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చారు. ప్రజల అభివృద్ధికి చేయూతనిచ్చారు.తెలుగు నేతలు ఎంతో మందితో  సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.   డిసెంబర్ 25న భారతరత్న  ఏబీ వాజపేయి శతజయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. భారత ప్రభుత్వం పలువురు ప్రముఖులతో ఓక కమిటీ సైతం ఏర్పాటు చేసింది. అటల్ అంటే , సుపరిపాలన, అందుకే భారత ప్రభుత్వం, ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సుపరిపాలన దివస్ గా అధికారికంగా నిర్వహిస్తున్నారు.
 
ఆ కార్యక్రమాల్లో భాగంగా  డిసెంబర్ 11 నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో  భారతరత్న వాజ్‌పేయిని భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో  అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖ చేపడుతోంది.  ప్రతి జిల్లా కేంద్రంలో మొదటి దశలో వారి నిలువెత్తు విగ్రహాలు ఏర్పాటు చేసి వాటిని పలువురు ప్రముఖులు చేత ప్రారంభించడానికి వారు అత్యంత ఉన్నతంగా ప్రేమించే భగవాన్ సత్యసాయి జన్మస్థలం అయిన సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రారంభించాలని నిర్ణయించారు.
 
ఈ యాత్ర ఈ నెల 11న ప్రారంభం కాగా,  25న విజయవాడలో ఆయన 100వ జన్మదినం రోజున ముగుస్తుంది. దేశమే కుటుంబంగా భావించిన మహోన్నతుని శతజయంతి సందర్భంగా తెలుగు గడ్డతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకునే ప్రయత్నం ఇది.  కాంగ్రెస్ ప్రజాస్వామ్య ఘాతక విధానాలను వాజపేయి ఎప్పటికప్పుడు వ్యతిరేకించేవారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ముందుండేవారు.   
 
1984 ఆగస్టు 16న  గవర్నర్ రామ్‌లాల్ నాడు ఎన్టీఆర్ మెజారిటీ ప్రభుత్వాన్ని రాత్రికి రాత్రి కూలదోయడం భారత రాజకీయ చరిత్రలో అతి పెద్ద రాజ్యాంగ సంక్షోభం. ఆ సమయంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు  అటల్ బిహారీ వాజ్‌పేయి ఎన్టీఆర్‌కు బలమైన అండగా, ధైర్యంగా నిలిచారు.  అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వాజపేయి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూలదోసిన విషయం తెలిసి వెంటనే స్పందించారు.   రామ్‌లాల్ డిస్మిస్ చేసిన రాత్రి ఎన్టీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. వాజ్‌పేయి తెల్లవారకముందే ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి  “ అటల్ మీతో ఉన్నారు ధైర్యంగా ఉండు, పోరాడు” అని ధైర్యం చెప్పారు. 
 
అంతే కాదు ఎన్టీఆర్‌ను ఇందిరాగాంధీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలియడంతో  6 ఫిరోజ్‌షా రోడ్ ఇంటికి తీసుకెళ్లారు.  వాజ్‌పేయి ఎన్టీఆర్‌ను తన ఇంట్లోనే రెండు రోజులు ఉంచి రక్షించారు. ఆ ఇల్లు అప్పట్లో ఎన్టీఆర్ సేఫ్ హౌస్  అయింది. 1984 ఆగస్టు 17–20 మధ్య ఢిల్లీలో వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఇందిరా గాంధీ  గో బ్యాక్ – సేవ్ డెమెక్రసీ  ఉద్యమం చేశారు. వాజ్‌పేయి స్వయంగా అరెస్టు అయ్యారు. 
 
వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీలు ఎన్టీఆర్‌ను తీసుకుని రాష్ట్రపతిని కలిసి గవర్నర్  నిర్ణయాన్ని రద్దు చేయించేందుకు ఒత్తిడి తెచ్చారు. ఇది అత్యంత కీలకమైన పరిణామం. ఆ ప్రజా పరిరక్షణ ఉద్యమం కారణంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది.  16 సెప్టెంబర్ 1984 న  హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారానికి వాజ్‌పేయి స్వయంగా వచ్చారు. 
 
రాజ్‌భవన్ గేటు దగ్గర ఎన్టీఆర్‌ను గట్టిగా కౌగిలించుకుని  “ఇది ప్రజాస్వామ్య విజయం” అని  సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఫోటో ఇప్పటికీ చరిత్రలో ఉంది. అందుకే ఎన్టీఆర్  ఎప్పుడూ  “నా జీవితంలో అతి క్లిష్ట సమయంలో అటల్‌జీ తప్ప నాకు ఎవరూ అండగా నిలబడలేదు. ఆయన లేకపోతే నేను రాజకీయంగా ముగిసిపోయేవాడిని.” అనే  మాట గుర్తు చేసుకుంటారు. 
 
ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సంచలనాత్మక మలుపులో ..  ఇందిరాగాంధీ చేసిన ప్రజాస్వామ్య హత్యాయత్నాన్ని అడ్డుకుని చరిత్రలో  వాజ్‌పేయి నిలిచిపోయారు.  ఆంధ్రప్రదేశ్‌లో వాజ్ పేయి అనుబంధం ఇప్పుడు ఏ మూలకు వెళ్లినా కనిపిస్తుంది.  జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లు, పేదలకు ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో సైతం హైటెక్ సిటీకి కేంద్రం నుంచి మొదటి భారీ సపోర్ట్ వాజ్‌పేయి ప్రభుత్వం నుంచే వచ్చింది.    
 
విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఆలోచన  వాజ్‌పేయిదే.  పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని 2004లోనే వాజ్‌పేయి నిర్ణయం తీసుకున్నారు  కానీ ఎన్నికల్లో ఓడిపోవడంతో అమలు కాలేదు. తర్వాత మళ్లీ బీజీపే ప్రభుత్వం వచ్చిన తరవాతనే సాధ్యమయింది.  1998 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన కేంద్ర ప్రాజెక్టులు, నిధులు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని అధ్యాయంగా నిలిచిపోయాయి. 
 
ఆ కాలంలోనే రాష్ట్రానికి వచ్చిన మొత్తం కేంద్ర సహాయం రూ.22,000 కోట్లకు పైగా ఉంటుంది. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా మాదాపూర్‌లో హైటెక్ సిటీని ప్రారంభించారు. రూ.800 కోట్ల కేంద్ర గ్రాంట్‌తో పాటు 10 సంవత్సరాల ట్యాక్స్ హాలిడే ఇవ్వడంతో హైదరాబాద్  సైబరాబాద్ గా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఎదిగింది.  విశాఖపట్నం సముద్రతీరంలో దేశంలోనే అతిపెద్ద రోడ్డు ప్రాజెక్టు గోల్డెన్ క్వాడ్రిలాటరల్‌కు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశ ఆర్థిక రాజధానిగా మారుస్తుందని ప్రకటించారు. 
 
అన్నట్లుగానే విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు.  రూ.1,500 కోట్ల కేంద్ర ఈక్విటీ సౌకర్యం కల్పించారు.  విశాఖపట్నం పోర్టును 14 మీటర్ల డ్రాఫ్ట్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి రూ.1,200 కోట్లు, ఉప్పల్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న ఆ ఆరు సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు, నిధులు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ గర్వంగా గుర్తుచేసుకునే బంగారు కాలం.

బీజేపీ అధ్యక్షునిగా, ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో  భారత రత్న వాజ్‌పేయికి ప్రత్యేకమైన పేజీ ఉంటుంది. ఎంతో మంది తెలుగు రాష్ట్రాల నేతలతో ఆత్మీయ బంధం ఉంది. ముఖ్యంగా జూపూడి యజ్ఞనారాయణ, దేవిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, వి రామారావు, బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు, చందుపట్ల జంగారెడ్డి, విద్యాసాగర్ రావు, ఇంద్ర సేనా రెడ్జి, పీ.వి. చలపతి రావు, చిలకం రామచంద్రా రెడ్డి, దత్తాత్రేయ , కిషన్ రెడ్డి, హరిబాబు, సోము వీర్రాజు వంటి సీనియర్ నేతలతో పాటు, నేటి యువతరం నేతలు , శ్రీనివాస వర్మ, సత్యకుమార్, మురళీధర్ ధర్ రావు, బండి సంజయ్ , చల్లా పల్లి నరసింహ రెడ్డి లాంటి అనేకమంది ఇతర నేతల వరకు వారు అనేక సందర్భాలలో స్పూర్తి పోందారు .

తెలుగు రాష్ట్రాల నాయకులతో వాజ్‌పేయి అనుబంధం బీజేపీ విస్తరణకు పునాది వేసింది. వాజ్‌పేయి బీజేపీ అధ్యక్షుడిగా (1980-1986, 1993-1996) ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు.  వెంకయ్య నాయుడు జనతా పార్టీ నేతగా, తర్వాత బీజేపీలో చేరినప్పుడు వాజ్‌పేయి వ్యక్తిగతంగా మార్గదర్శనం చేశారు.   

 
వెంకయ్య నాయుడు ఎప్పుడూ “అటల్‌జీ నా గురువు, ఆయన లేకపోతే రాజకీయాల్లో నా ప్రయాణం అంత సులభం  కాదు” అని అంటుంటారు.  గతంలో రెండు సార్లు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం వచ్చిందని, వారి సూచనలు వెలకట్టలేనివని అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ  మొదటి రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురానికి చెందిన దేవిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి.  దేశంలో బీజేపీ ప్రారంభించిన వెంటనే జాతీయ అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. 
 
వారి నేతృత్వంలో పార్టీ జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. తర్వాత మొదటి సంస్థాగత ఎన్నికల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీ చలపతిరావు ఎన్నికయ్యారు. వీరు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలను  వదిలేసి ఆర్ఎస్ఎస్ ప్రేరణతో  బీజేపీలోకి వచ్చినప్పుడు వాజ్‌పేయి ఇలాంటి అనేక మంది యువకులకు మార్గదర్శకత్వం చేశారు.  పొంగులూరి వెంకట చలపతి రావుతో  వాజ్ పేయికి ప్రత్యేక అనుబంధం ఉంది. వారి ప్రేరణతో మొదటి విశాఖ మేయర్ పదవిని  చలపతి రావు నేతృత్వంలో గెలుపొందారు. 
 
నాడు డి. యస్.యన్ రెడ్డి లాంటి యువనేత మేయర్ కావడం, అందులో తెలుగు రాష్ట్రాల్లో నేరుగా విజయం సాధించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి ప్రయోగాలు ఆంధ్రలో బీజేపీని బలోపేతం చేయడానికి వాజ్‌పేయి వ్యక్తిగతంగా చలపతి రావుకు మార్గదర్శనం అందించారని ఆయన పలు సందర్భాలలో పేర్కొన్నారు.అనంతరకాలంలో శాసన మండలిలో మెజారిటీ గ్రాడ్యుయేట్ సభ్యులు బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 
 
1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ కూలదోసినప్పుడు బీజేపీ రాష్ట్ర యూనిట్ ఎన్టీఆర్‌కు పూర్తి మద్దతు ఇవ్వడానికి నాడు అనేక మంది తెలుగు నేతలు వారి సూచనల కారణంగా నేతృత్వం వహించారు. ఆ కాలంలోనే రాష్ట్రంలో మొదటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు.

అలాగే  ఆంధ్రప్రదేశ్ బీజేపీ చరిత్రలో  చిలకం రామచంద్ర రెడ్డి హయాం ఓ స్వర్ణయుగం.  నాడు 12 మంది యంయల్ఏలు, 7 మంది లోకసభ సభ్యులు, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 1980లలో రాష్ట్రంలో పార్టీని నిలబెట్టిన ముగ్గురు సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. వాజ్‌పేయితో ఆయన అనుబంధం 1980 నుంచి 2004 వరకు దాదాపు 25 ఏళ్లు – రాజకీయం, భావోద్వేగం, వ్యక్తిగత స్నేహం మూడూ కలిసిన అపూర్వ బంధం. 

 
చిలకం రామచంద్ర రెడ్డి జనతా పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా ఉంటూ బిజెపి ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ, వాజ్ పేయితో అనుబంధం ఏర్పరచుకున్నారు.  వాజ్‌పేయి  ప్రధానిగా ఉన్న సమయంలో వెంకయ్యనాయుడు జాతీయ అధ్యక్షుడు చేసి  తెలుగు నేల నేతలను పార్టీలో ప్రోత్సహించడం వారి గోప్ప్ప తనానికి నిదర్శనం. కర్నాటకలో పార్టీ అధికారంలో రావడం ద్వారా పార్టీ ఉత్తరాధి రాష్ట్ర పార్టీ అనే ముద్రను చెరపడానికి వారు వెంకయ్యనాయుడు నాయకత్వంలో చాలా ప్రయత్నాలు చేశారు. 
 
ఫలితంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్నాటకలోని విజయం సాధించారు. మరో తెలుగు బీజేపీ దిగ్గజం బంగారు లక్ష్మణ్‌తోనూ భారతరత్న వాజ్ పేయికి మంచి అనుబంధం ఉండేది.  బంగారు లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకులు.  బంగారు లక్ష్మణ్  2000 నుండి 2001 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు, వాజ్‌పేయి  ప్రధానమంత్రిగా ఉన్నారు.  పార్టీలో లక్ష్మణ్   సేవలు, అనుభవం పట్ల వాజ్‌పేయికి ఎక్కువ గౌరవం ఉండేది.
ఇలా అలనాటి తెలుగు నేతలతో వాజ్ పేయి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం పెంచుకున్నారు.  ఇద్దరి తెలుగు వారిని, జానా క్రిష్ణమూర్తి వంటి తమిళ నేతలను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి వాజ్‌పేయి ప్రయత్నం, సూచనలు మరువలేనివి. నేటి ముఖ్య మంత్రి, నారా చంద్రబాబు నాయుడుతో అటల్ బిహారీ వాజపేయి గారికి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. 1999 ఎన్నికల్లో, 2004 ఎన్నికల్లో కలిసి పనిచేశారు. దేశంలో అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు నాటి ముఖ్యమంత్రిగా వారితో కలిసి పనిచేశారు.
రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారి సహకారంతో నేను విజయవంతంగా పూర్తి చేశాను చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటారు.  హైద్రాబాద్‌లో అనేక జాతీయ సంస్థలు ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి సడక్ రోడ్డు, హైదరాబాద్-బెంగళూర్ జాతీయ రహదారి విస్తరణ వంటి కీలకమైన ప్రాజెక్టులు నాడు చంద్రబాబు-వాజపేయి  హయాంలో జరిగాయి. తర్వాత కాలంలో ఈ ప్రాజెక్టు మూడు రాష్ట్రాలలో అభివృద్ధికి ఎంతో కీలకంగా మారింది.

అటల్ బీహార్ వాజ్ పేయి అద్భుతమైన సాహిత్య వేత్త అని తెలుసు. ఆయన తెలుగు సాహిత్యాన్ని కూడా అభిమానిస్తారు. తెలుగు  ప్రఖ్యాత కవులు శ్రీశ్రీ , దాశరథి కృష్ణమాచార్యులు, సి.నారాయణ రెడ్డి  వంటి వారి రచనలను ఆయన బాగా అధ్యయనం చేశారు.  ముఖ్యంగా శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’లోని ఒక కవిత ఆయనకు అత్యంత స్ఫూర్తిని ఇచ్చిందని  ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. 

 
2003 సంవత్సరంలో జరిగిన ఒక బహిరంగ సభలో, అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈ విషయాన్ని స్వయంగా గుర్తు చేసుకున్నారు. శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ కవితా సంకలనంలోని ‘జయభేరి’ అనే కవితలోని కొన్ని ముఖ్యమైన పంక్తులను ఆయన ప్రస్తావించారు. సైద్ధాంతికంగా శ్రీ శ్రీ వామపక్షవాది అయిన నేను వారి సిద్ధాంతాలను ఏకీభవించను, అయితే వారి గోప్ప కవులుగా గుర్తింపు ఇవ్వడం మన బాధ్యత అని చెప్పడం వారి  గోప్ప ఆలోచనలు ఉదాహరణ అని చెప్పవచ్చు. 
 
“శ్రీశ్రీ ‘జయభేరి’లోని ఆ పంక్తులు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నాకు చాలా ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది,” అని వాజ్‌పేయి   ఉద్వేగంగా ఆ సమావేశంలో చెప్పారు.  వాజ్‌పేయి  స్వయంగా గొప్ప కవి, సున్నిత మనస్కులు. అందుకే, భావాన్ని బలంగా వ్యక్తం చేసే కవిత్వాన్ని, అది ఏ భాషదైనా, ఆయన గౌరవించేవారు. శ్రీశ్రీ, దాశరథి వంటి కవులు సమాజంలోని అసమానతలను ప్రశ్నించి, విప్లవాత్మకమైన మార్పుఆకాంక్షించిన భావజాలాన్ని వాజ్‌పేయి  గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలతో, నాయకులతో, అభివృద్ధితో ప్రతి విషయంలోనూ  వాజ్ పేయి  అనుబంధం ఎంత వర్ణించినా ఇంకా మిగిలిపోయి ఉంటుంది. అటువంటి మహానుభావుని శతజయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజలందర్నీ భాగస్వామ్యం చేస్తోంది. యువతకు వారి ఆలోచనలు, ఆశయాలు అందించేందుకు కృషి చేస్తున్నది, ఇది అభినందనీయం. 

 
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా భరత్ అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆంక్షలను లెక్క చేయకుండా భారత్ తమ కాళ్లమీద నిలబడేలా సంస్కరణలు చేపట్టింది ఆయనకే సాధ్యం .  అందుకే ఆయన అణు పరీక్ష విజయవంతం తరువాత జై జవాన్, జై కిషాన్ , జై విజ్ఞాన్ అని నినదించారు. అలాంటి నేతను చూసి నేత రాజకీయ నేతలు కచ్చితంగా ఆధర్శంగా తీసుకోవాలి. ఈ సందర్భంగా భారతరత్న సేవల్ని మనం గుర్తు చేసుకోవడం మనకే గౌరవం.