దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన నాయకుడు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కొనియాడారు. వాజపేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మాధవ్ చేపట్టిన సుపరిపాలన యాత్ర శనివారం నంద్యాలకు చేరుకుంది. మంత్రులు సత్యకుమార్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా వారు వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ సిద్ధాంతాలు, విలువలతో రాజకీయం చేసిన అరుదైన మహనీయుడు వాజపేయి అని తెలిపారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఐటీ, పారిశ్రామిక, విద్య తదితర రంగాల అభివృద్ధికి ఆయన పునాది వేస్తే దానికి కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నారని చెప్పారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని హోదాలో దేశాభివృద్ధికి ఎంతో చేశారని చెప్పారు. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు వాజపేయి అని పేర్కొన్నారు. ‘దేశ అభివృద్ధికి పునాది వేసిన దార్శనికుడు వాజపేయి. కానీ కొంతమంది ప్రజలకు సేవలందించకపోయినా వారి విగ్రహాలు ఊరూరా ఏర్పాటు చేస్తున్నారు’ అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
శనివారం కడప నగరం రాజీవ్‌మార్గ్ రోడ్డులో ఏడున్నర అడుగుల వాజపేయి కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలసి ఆవిష్కరించారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ కొంతమంది నాయకుల ముసుగులో వారి విగ్రహాలు ఊరూరా, సందుసందులో ఏర్పాటు చేయిస్తూ స్వంత చిన్నాన్ననే లేపేశారని ధ్వజమెత్తారు. మన కడపోడు, మనవాడు అని సంకనెత్తుకుంటే రాష్ట్రం కోలుకోలేని రీతిగా దెబ్బతింటుందని మండిపడ్డారు.
కేంద్రమంత్రి మాట్లాడుతూ వాజపేయి బలమైన దేశ నిర్మాణం కోసం తపిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవి, భూపేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Stories
ఆలయ ధ్వజస్తంభాల కోసం దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం
డిసెంబర్ 15న బ్లూ బర్డ్-6 అమెరికా ఉపగ్రహ ప్రయోగం
శ్రీవారి సేవలో పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు