రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ గత నెల రోజుల్లో యుద్ధంలో దాదాపు 25 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వారిలో ఎక్కువ మంది సైనికులే మరణించిన విషయాన్ని వెల్లడించారు.
ఇది ఎవరూ కోరుకోని పరిణామని ట్రంప్ స్పష్టం చేస్తూ ఇది వెంటనే ఆగిపోవాలని, అందుకు తాము చాలా కష్టపడి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో పురోగతి లేకపోవడంపై ట్రంప్ అసహనంతో ఉన్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.
ట్రంప్ ఆయా దేశాల అధికారుల నుంచి మాటలు కాకుండా ఫలితాలు కోరుకుంటున్నారని చెబుతూ విసిగిపోయిన అధ్యక్షుడు చర్యలకు సిద్ధమైనట్లుగా తెలిపారు. ఈ శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడంలో ట్రంప్ పరిపాలనా సిబ్బంది చురుకుగా ఉన్నారని చెప్పారు. “ప్రెసిడెంట్ ఇప్పటి వరకూ జరిగిన పదేపదే చర్చలతో విసిగిపోయారు. ఫలితం లేకుండా మాటలు మాట్లాడటానికి ఆయన సిద్ధంగా లేరు. యుద్ధం ముగియాలంటే చర్యలు కావాలి, మాటలు కాదు” అని లెవిట్ స్పష్టం చేశారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు పురోగమించేందుకు ట్రంప్ స్వయంగా యూరప్ నాయకులతో మాట్లాడుతున్నారని ఆమె వెల్లడించారు. అలాగే ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ బృందం కూడా రెండు దేశాల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతున్నట్లు చెప్పారు. యుద్ధం ముగించేందుకు ట్రంప్ 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 20 పాయింట్లతో కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. దీన్ని అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పటికే అందించినట్లు తెలిపారు. డాన్‌బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించేందుకు సిద్ధంగా లేమని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విస్తృత ప్రణాళికపై అమెరికాతో చర్చిస్తామని చెప్పారు.

More Stories
భారత్ పై 50 శాతం సుంకాలను ముగించాలని అమెరికాలో తీర్మానం!
నోబెల్ గ్రహీత నర్గెస్ మొహమ్మది అరెస్ట్
థాయ్- కాంబోడియా ఘర్షణలో హిందూ దేవాలయంకు నష్టం