చైనా వృత్తి నిపుణులకు వీసాల జారీ వేగవంతం

చైనా వృత్తి నిపుణులకు వీసాల జారీ వేగవంతం

గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా  మధ్య నెలకొన్న ఉద్రిక్త త క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చైనా నిపుణులకు వాణిజ్య వీసాల జారీపై భారత ప్రభుత్వం తాజాగా సడలింపులు చేసింది. చైనా నిపుణులకు సాధ్యమైనంత వేగంగా వాణిజ్య వీసా జారీ కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసినట్లు సమాచారం. ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఇది దోహదం చేయనుంది. 

వీసా పరిశీలనలో జరుగుతున్న ఆలస్యాలు తగ్గి, వ్యాపారాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన సిబ్బంది రాక ఇప్పుడు మరింత సులభమవుతుంది. ఇది రెండు దేశాల ఆర్థిక బంధానికి పాజిటివ్ అడుగుగా భావిస్తున్నారు. ‘‘మేము దరఖాస్తుల స్క్రూట్నీ ప్రక్రియలో నిబంధనలు సడలించాం.. నాలుగు వారాల్లోపు బిజిజెన్ వీసాలను ప్రాసెస్ చేస్తున్నాం’ అని ఓ అధికారి తెలిపారు.

ఎస్ సి ఓ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీతో పరిస్థితులు కొంత హుందాగా మారాయి. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడం, సహకారాన్ని పెంచుకోవడం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఇరువురూ దృష్టి పెట్టారు. ఈ చర్చల తరువాతే వీసా నియమాల్లో సడలింపులు రావడం ప్రాధాన్యంగా మారింది.

గత కొన్నేళ్లుగా కఠినమైన వీసా పరిశీలన కారణంగా భారత ఎలక్ట్రానిక్స్ రంగం భారీ నష్టాన్ని చవిచూసింది. అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్ అంచనా ప్రకారం.. కఠినమైన పరిశీలన కారణంగా నాలుగేళ్లలో మొబైల్ తయారీకి చైనా నుంచి కీలక యంత్రాలను దిగుమతి చేసుకునే భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమదారులకు 15 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.

షొవోమి వంటి చైనా కంపెనీలు వీసాలు పొందడానికి ఇబ్బంది పడ్డాయని రాయిటర్స్ గతేడాది నివేదించింది. ఇప్పుడు వీసా ఆమోద సమయాన్ని నాలుగు వారాలకు తగ్గించడం పరిశ్రమలకు ఉపశమనం కలిగించనుంది. తాజా నిర్ణయం భారత్–చైనా వాణిజ్య సంబంధాలను మళ్లీ చురుకుగా చేయనున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.