ఇప్పటికే అమెరికా విధించిన సుంకాలపై తీవ్ర సతమతమవుతున్న భారత్‌పై అమెరికా పొరుగుదేశం మెక్సికో కూడా సుంకాల బాదుడును మొదలుపెట్టింది. భారత్, చైనా సహా పలు ఆసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 50 శాతానికి పెంచుతున్నట్లు మెక్సికో ప్రకటించింది. ఈ నిర్ణయం వచ్చే సంవత్సరం (2026) నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
ఈమేరకు ప్రతిపాదనతో కూడిన బిల్లుపై మెక్సికో సెనేట్ బుధవారం రోజే ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుపై సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించగా 76 మంది ఎంపీలు అనుకూలంగా, ఐదుగురు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 35 మంది ఎంపీలు ఓటింగ్‌కు హాజరుకాలేదు. స్వదేశీ పరిశ్రమలు, వ్యాపారులు, తయారీదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం మెక్సికో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇందులో భాగంగా మెక్సికోతో వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుంచి దిగుమతి అయ్యే దాదాపు 1,400 వస్తు,ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని విధించనున్నారు. దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గకుండా చూడటం, తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బౌమ్ వెల్లడించారు. అందుకే ప్రభావిత వ్యాపార సంస్థలు, దేశాల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆమె తెలిపారు.
భారత్, చైనాల నుంచి మెక్సికోకు సరఫరా అయ్యే వస్తు,ఉత్పత్తుల జాబితాలో వాహన విడిభాగాలు, తేలికపాటి వాహనాలు, దుస్తులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, స్టీల్, ఇళ్లలో వినియోగించే ఉపకరణాలు, బొమ్మలు, వస్త్రాలు, ఫర్నీచర్, ఫుట్‌వేర్, లెదర్ సరుకులు, కాగితం-కార్డ్ బోర్డ్, ద్విచక్రవాహనాలు, అల్యూమినియం, ట్రైలర్స్, గ్లాస్, సబ్బులు, పర్ఫ్యూమ్లు, కాస్మెటిక్స్ ఉన్నాయి.
ఇప్పటివరకు వీటిలో చాలావరకు వస్తు,ఉత్పత్తులపై 35 శాతం సుంకాన్నే మెక్సికో విధించేది. 2026 నుంచి మాత్రం 50 శాతం సుంకాన్ని బాదుతారు. ఫలితంగా ఈ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. పర్యవసానంగా ఎంతోమంది ఉపాధిని కోల్పోయే ముప్పు ఉంది.
భారత్ నుంచి పెద్ద సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, మెక్సికో వరుస స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం భారతీయ కార్లపై మెక్సికో 20 శాతం సుంకాన్ని విధిస్తోంది. వచ్చే సంవత్సరం నుంచి ఇది కాస్తా 50 శాతానికి పెరిగిపోతుంది. దీనివల్ల భారత్‌లోని ప్లాంట్లలో కార్లను తయారు చేసి మెక్సికోకు సరఫరా చేసే ఫోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్, నిస్సాన్, మారుతీ సుజుకీలపై ఎక్కువ ప్రభావం పడనుంది.
కార్లపై దిగుమతి సుంకాల పెంపును అడ్డుకోవడానికి ఈ కంపెనీలు చేసిన లాబీయింగ్ ఫలించలేదు. దీంతో ఈవిషయంలో నేరుగా మెక్సికో ప్రభుత్వంతో చర్చించమని భారత వాణిజ్య శాఖకు ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్’ (ఎస్ఐఏఎం) వినతిపత్రాన్ని సమర్పించింది. మెక్సికో కంపెనీలు తయారు చేసే హై ఎండ్ కార్ల విభాగంలో భారతీయ కంపెనీలు లేనందున, తమ వల్ల వాటికి నష్టమేం జరగదని తెలిపింది.
ఏటా మెక్సికోలో జరిగే కార్ల అమ్మకాల్లో భారత కార్ల వాటా 6.7 శాతమే ఉందని ఎస్ఐఏఎం పేర్కొంది. 50 శాతం సుంకాల ప్రభావం వల్ల భారత్‌లోని ప్లాంట్లలో కార్ల తయారీ ప్రణాళికలతో పాటు మార్కెటింగ్ వ్యూహాలను మార్చాల్సి వస్తుందని తెలిపింది.

More Stories
జమాతే ఇస్లామీ అమీర్ డా. రెహమాన్ తో భారత దౌత్యవేత్త భేటీ!
మారుమూల గ్రామాల్లో ఉండే ఇతర రాష్ట్రాల వారిపై ఏపీ నిఘా
కులం, సంపద, భాష ఆధారంగా ప్రజలను అంచనా వేయవద్దు