ఐపిఇలో హిందూమతంపై దుర్భాషలతో గెస్ట్ ఫ్యాకల్టీ బోధనలు!

ఐపిఇలో హిందూమతంపై దుర్భాషలతో గెస్ట్ ఫ్యాకల్టీ బోధనలు!
హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ ఎంట్రప్రెసెస్ (ఐపిఇ) మానేజ్మెంట్ విద్యలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బోధనా సంస్థలలో ఒకటి. అక్కడ బిజినెస్ మానేజిమెంట్ కోర్సులో ప్రామాణికమైన బోధనా జరుగుతోందని పేరుంది. అయితే, ఇటీవల ఒక గెస్ట్ ఫ్యాకల్టీ బోధనాంశాలతో ఏమాత్రం సంబంధం విద్యలో లేకుండా హిందూ మతాన్ని దూషిస్తూ, హిందువులను ఒక సామజిక వర్గం వారు వంచిస్తున్నారని అంటూ బోధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ కలకలం రేపుతోంది.
 
దీనిపై ఖంగు తిన్న ఐపిఇ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస మూర్తి విద్యార్థులకు పంపిన ఒక సందేశంలో విచారం వ్యక్తం చేస్తూ అతనిపై తగు చర్య తీసుకుంటామని హామీ ఇస్తూ, ఇక భవిష్యత్ లో గెస్ట్ ఫాకల్టీగా ఆహ్వానించబోమని స్పష్టం చేశారు. అయితే ఈ అంశాన్ని సోషల్ మీడియా, మీడియాలో వ్యాప్తి చెందకుండా చూడాలని వారిని కోరారు. ఆ విధంగా జరిగితే సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
శుభ్రెండు భట్టాచార్య పేరు గల ఆ గెస్ట్ ఫ్యాకల్టీ ఆర్ధిక, వాణిజ్య, కార్పొరేట్ అంశాలపై కాకుండా హిందూ మతంకు తనదైన భాష్యం చెప్పుకొచ్చారు. హిందూ మతం అంటే భగవద్గీత, వేదాలు మాత్రమే అని, వాటిల్లో ఎక్కడా విగ్రహారాధన లేదంటూ కేవలం  బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం విగ్రహారాధనను ప్రోత్సహిస్తూ మోసం చేస్తున్నారంటూ విమర్శించారు. తాను కూడా బ్రాహ్మణుడిని అయినప్పటికి అటువంటి వారి పట్ల ఉపేక్షింపబోనని స్పష్టం చేశారు.
 
పైగా, తరగతి గదులలో మీరు వేదాన్ని ఎందుకు బోధించడం లేదు? హిందూ మతం ప్రధాన స్రవంతి అయిన గీతను ఎందుకు బోధించడం లేదు? మీరు ప్రజలను విగ్రహాలను పూజించేలా ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? గీత,  వేదాలలో విగ్రహాల ప్రస్తావన ఎక్కడ ఉంది? గీత, వేదాలలో ఏ విగ్రహంను ప్రస్తావించారు?  ఏ తల్లి (మాత)ను ప్రస్తావించారు? ఏ జంతువు (పశువు)ను ప్రస్తావించారు?
 
అంతటితో ఆగకుండా గణేశుడిని ఎందుకు పూజించమని బలవంతం చేస్తున్నారు? వారిని “కోతి దేవుడు”ని మాత్రమే పూజించమని ఎందుకు బలవంతం చేస్తున్నారు? మీరు వారిని నరసింహ స్వామిని ఎందుకు పూజిస్తున్నారు? ఆ దేవత తన గోళ్ళతో ప్రహ్లాదుడి తండ్రి కడుపును చీల్చడానికి దిగివస్తుందని చెబుతారు. మనం మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు, దేవుడు మనకు మరణాన్ని ఇవ్వడానికి ఇక్కడకు వస్తాడా? అంటూ హిందూ దైవాల గురించి అసభ్యంగా మాట్లాడుతూ వచ్చారు.
 
దేవుడు స్వర్గంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడి తండ్రికి మరణాన్నిఇవ్వకుండా అతడిని వాదించేందుకు ఇక్కడిదాకా దిగి రావాల్సి వచ్చిందా? అంటూ ఎద్దేవా చేశారు.”ఒక రాక్షసుడిని చంపడానికి, దేవుడు భూమిపైకి దిగి రావాలి, ఇక్కడ నడవాలి, త్రిశూలం తీసుకొని చంపాలి. స్వర్గంలో కూర్చుని ఎవరినైనా చంపే శక్తి దేవునికి లేదా? దేవుడు తల్లి (మాత) కి ఒక పెద్ద త్రిశూలం ఇచ్చే శక్తి కలిగి ఉండాలి, తద్వారా ఆమె ఇక్కడ ఉన్న రాక్షసుడిని (అసురుడిని) చంపగలదు” అంటూ అర్ధం లేకుండా ఇష్టం వచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
 
“దేవాలయాల బ్రాహ్మణ పూజారులైన పండిట్ పురోహితులు వ్యాప్తి చేసిన ఈ మూర్ఖత్వాన్ని చూడండి. వారు ప్రజల డబ్బును దోచుకుంటున్నారు మరియు ప్రజల మనస్సులను దోచుకుంటున్నారు. ప్రజలు అజ్ఞానులు. వారు ఐదు రోజులు వెళ్లి, ఇలా కూర్చుని, పండితుడి ముందు పూజలు చేసి, ఆపై వెళ్లిపోతారు” అంటూ అసందర్భంగా చెప్పుకొచ్చాడు.
 
పైగా, ప్రజలు విగ్రహారాధనను మానివేసి ధ్యానం చేయాలని సూచిస్తూ మీరు ప్రజలకు ఇంట్లో అరగంట ధ్యానం చేయమని, ఆలయానికి రావద్దని చెప్పాలని విద్యార్థులను కోరాడు. “గీత అన్ని వేళలా ధ్యానం చేయమని చెబుతుంది. వేదాలు అన్ని వేళలా ధ్యానం చేయమని చెబుతాయి. నేను ప్రతిరోజూ అరగంట ధ్యానం చేస్తాను. నేను ఏ ఆలయానికి వెళ్లను, నేను ఏ తీర్థయాత్రకు వెళ్లను. నేను సంతోషంగా,ఆరోగ్యంగా ఉన్నాను. మీరందరూ అలా ఎందుకు ఉండలేరు?” అంటూ ప్రశ్నించాడు.
 
“ప్రజలు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? మీరు తీర్థయాత్రలకు వెళ్లి వరుసలో నిలబడి ఉన్న భక్తుల చెమట వాసనను ఎందుకు పీల్చుకోవాలి? ఒక గంట, మూడు గంటలు, నాలుగు గంటలు క్యూలో నిలబడి ఉన్న అజ్ఞానుల చెమట వాసన మీకు వస్తుంది. వారు చెమటలు పట్టి, మనం వాసన చూడాల్సిన దుర్వాసనను వెదజల్లుతున్నారు. ఎందుకు?” అంటూ దేవాలయాలకు వెడుతున్న వారిని చులకన చేస్తూ చెప్పుకొచ్చాడు. 
 
“కొన్ని సమూహాలు మనల్ని ఎలా వేధిస్తున్నాయో, మనల్ని నిరాశపరుస్తున్నాయో, మనల్ని మూర్ఖులను చేస్తున్నాయో మీరు చూశారా? ఆపై మనం “హిందూత్వం, హిందూ మతం గొప్ప మతం. ముస్లింలు చెడ్డవారు. క్రైస్తవులు చెడ్డవారు. మనం ఉత్తములం” అని అంటాము. ఈ అజ్ఞాన పండితులతో, మనం ఉత్తములం” అంటూ చెప్పుకొచ్చాడు.
 
అంతటితో ఆగకుండా తల్లితండ్రుల పట్ల కూడా నిందాపూర్వకంగా మాట్లాడాడు. “నా తల్లిదండ్రులకు భగవద్గీత లేదా వేదాలు తెలియవు. మీ తల్లిదండ్రుల్లో ఎవరికీ భగవద్గీత లేదా వేదాల నుండి ఒక్క శ్లోకం కూడా తెలియదు. మీ తల్లిదండ్రులందరూ కూడా నా తల్లిదండ్రుల లాంటివారే. దేవాలయ బ్రాహ్మణ పండితుల ప్రతికూల ప్రభావం కారణంగా గీతను ఎప్పుడూ చదవని, వేదాన్ని ఎప్పుడూ చదవని వ్యక్తులు” అంటూ తల్లితండ్రులను దూషించాడు. 
 
దేవాలయాలలో పూజారులపై అక్కసును వెళ్లగక్కుతూ “నేను కూడా బ్రాహ్మణుడిని. కానీ ఈ దేశ మతాన్ని నాశనం చేసిన ఈ దేవాలయ బ్రాహ్మణులను నేను వ్యతిరేకిస్తున్నాను. దేవాలయాల లోపల మన మతాన్ని నాశనం చేస్తున్న ఈ దుష్ట బ్రాహ్మణుల కంటే సాధారణ ప్రజలు చాలా మెరుగ్గా ఉన్నారు” అని చెప్పారు.