సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.  2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్య ఘన విజయం సాధించారు. అయితే ఆయన విజయాన్ని సవాల్ చేస్తూ కె. శంకర అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చింది. 
 
ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలు (ఐదు గ్యారెంటీలు) అవినీతి ఎన్నికల కిందికి వస్తాయని పిటిషనర్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే స్పందించిన సుప్రీంకోర్టు  గృహజ్యోతి వంటి పథకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్న జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం దీనిపై స్పందించాలని సోమవారం సిద్ధరామయ్యకు ఆదేశాలు జారీ చేసింది. 
 
వరుణ నియోజకవర్గానికి చెందిన పిటిషనర్ కె. శంకర ఇప్పటికే దీనికి సంబంధించిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టులో దాఖలు చేయగా, ఏప్రిల్ 22వ తేదీన సిద్ధరామయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఆ తీర్పునే ఇప్పుడు పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.  ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనల ప్రకారం సిద్ధరామయ్య అవినీతి ఎన్నికల పద్ధతులకు పాల్పడ్డారని పిటిషనర్ కె.శంకర ఆరోపించారు. 
 
సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ సందర్భంగా మేనిఫెస్టోను ప్రకటించడం అవినీతి పద్ధతి ఎలా అవుతుందని.. జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రశ్నించారు. అయితే ఎన్నికల హామీలపై సుబ్రమణ్యం బాలాజీ కేసులో వచ్చిన తీర్పుపై త్రిసభ్య ధర్మాసనం ముందు సవాలు పెండింగ్‌లో ఉన్నందున, సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడానికే మొగ్గు చూపింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఐదు గ్యారెంటీలను పిటిషనర్ అవినీతి పద్ధతులుగా ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తున్నాయని, పురుషుల పట్ల వివక్ష చూపుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కారణంగా సిద్ధరామయ్య ఎన్నిక చెల్లదని ప్రకటించాలని, అంతేకాకుండా ఆయనను 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని పిటిషనర్ కోరారు.