వేంకటేశ్వరస్వామికి అపవిత్రత ఎవ్వరినీ చేయనీయను

వేంకటేశ్వరస్వామికి అపవిత్రత ఎవ్వరినీ చేయనీయను

* అమరావతిలో ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని తాను చేయను, ఎవరినీ చేయనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని చెబుతూ రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు.

అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి దశలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు.

రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్‌ స్టోన్‌ ఫ్లోరింగ్‌ నిర్మిస్తారు.  రెండో దశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్‌రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్‌ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్‌ వంటి పనుల్ని చేపడతారు. వీటికి రూ.120 కోట్ల వ్యయం కానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం శ్రీవారి ఆలయాన్ని రూ.185 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ దానిని రూ.36 కోట్లకు కుదించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ఆలయాన్ని 2014-19 నాటి ప్రణాళికను మించి సకల హంగులతో అభివృద్ధి చేసేందుకు అడుగు ముందుకేసిందని తెలిపారు.

“వేంకటేశ్వరస్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు. భూ త్యాగాలు చేసిన రైతులకు గత 5ఏళ్లలో పాలకులు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశాను. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులకు దేవుడు అన్యాయం జరగకుండా చూశాడు. తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. ఎన్నో అనుభవాలు చూశాను” అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 

“తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే నేను ప్రాణదానం చేపట్టా. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతీ ఒక్కరికీ ఇవ్వాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నాను. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి భక్తులు ముందుకు రావాలి” అని పిలుపిచ్చారు.