సింధ్‌ మళ్లీ భారత్‌లో కలవొచ్చు!

సింధ్‌ మళ్లీ భారత్‌లో కలవొచ్చు!
 
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సింధ్‌ ప్రాంతం తిరిగి భారత్‌లో కలవవచ్చునని, సరిహద్దులు మారొచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సింధి సమాజ్‌ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 1947లో దేశ విభజన జరిగినపుడు, ఇండస్‌ నదితోపాటు సింధ్‌ పాకిస్థాన్‌కు వెళ్లిందని గుర్తు చేశారు.

మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ “ఇది అడ్వాణీ చెప్పిన మాట. ఈ రోజు సింధ్ ప్రాంతం భారత్‌లో భాగం కాకపోవచ్చు. కానీ నాగరికత పరంగా చూస్తే, సింధ్ ఎప్పుడూ భారత్‌లోనే అంతర్భాగంగా ఉంటుంది. భూమి విషయానికొస్తే సరిహద్దులు ఎప్పుడైనా మారవచ్చు. రేపు సింధ్ మళ్లీ భారత్‌లో చేరుతుందేమో ఎవరికి తెలుసు?”  అని ప్రశ్నించారు.

వాస్తవానికి సింధ్ ప్రాంతాన్ని సింధీ ప్రజల మాతృభూమిగా పేర్కొంటారు. సింధూ లోయ నాగరికతకు ఇది ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. 1947 భారతదేశ విభజనతో ఈ ప్రాంతం పాకిస్థాన్​లో భాగమైంది. భారత నాగరికతలో సింధ్ ప్రాంతానికి ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు.  సింధ్‌లోని చాలా మంది ముస్లింలు సింధూ నది నీటిని పవిత్రంగా చూస్తారని చెప్పారు.

ముస్లింలు మక్కాలోని ఆబ్-ఎ-జమ్జమ్ కంటే సింధు నది నీరు తక్కువ పవిత్రమైనదిగా భావించరని రాజ్​నాథ్​​ పేర్కొన్నారు. ‘అడ్వాణీ తన పుస్తకంలో సింధీ హిందువులు, ముఖ్యంగా తన తరం వారు, సింధ్ ప్రాంతం భారత్ నుంచి విడిపోవడాన్ని ఇప్పటికీ అంగీకరించలేదని రాశారు’ ఆయన రాజ్​నాథ్​ గుర్తుచేశారు. 

“సింధూ నదిని పవిత్రంగా భావించే మన సింధ్ ప్రజలు ఎప్పుడూ మనవారే. వారు ఎక్కడ ఉన్నా, వారు ఎప్పుడూ మనకు చెందినవారే” అని ఆయన ఉద్వేగంగా పేర్కొన్నారు. కాగా,  పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీవోకే) ప్రజలూ మనవాళ్లేనని, అక్కడున్న వారికి భారత్‌తో దృఢమైన సంబంధాలు ఉన్నాయని గతంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు పీవోకే దానంతట అదే తిరిగి భారత్​లో చేరుతుందని కూడా ఆయన చెప్పారు.

ఇక, పొరుగు దేశాల్లో హింసను ఎదుర్కొంటున్న మైనారిటీ వర్గాలను రక్షించడానికి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఎంతో ఆవశ్యకమని రాజ్​నాథ్​ పేర్కొన్నారు. హిందూ సమాజాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ వారి బాధను అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే సీఏఏను తీసుకువచ్చామని ఆయన వివరించారు.

“పొరుగు దేశాల్లోని మైనారిటీ వర్గాలు చాలా ఏళ్లుగా బాధపడుతున్నారు. ముష్కరులు, దుండగులు వారి ఇళ్లను తగలబెట్టారు, వారి పిల్లలను చంపారు. వారి కుమార్తెలపై క్రూరత్వం ప్రదర్శించి, చిత్రహింసలు పెట్టారు. హిందూ ప్రజలను బలవంతంగా మతం మార్చారు” అని రాజ్‌నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.