అయోధ్యలో శ్రీ రామ సహస్రనామార్చన

అయోధ్యలో శ్రీ రామ సహస్రనామార్చన
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో జరగబోయే ధ్వజారోహణ కార్యక్రమానికి సంబంధించిన పూజలు రెండవ రోజూ విధి విధానాలతో సంపన్నమయ్యాయి.  వెయ్యి తులసి దళాలతో భగవాన్ శ్రీరాముని సహస్రనామార్చన చేశారు.  ఆచార్యులు మొదటి రోజు చేసినట్లుగానే గణపతి పూజ, పంచాంగ పూజ, షోడశ మాత్రికా పూజల అనంతరం మండప ప్రవేశ పూజ నిర్వహించారు. తర్వాత యోగిని పూజ, ప్రాంతపాలక పూజ, వాస్తు పూజ, నవగ్రహ పూజ, అలాగే ప్రధాన మండలంగా రామభద్ర మండల, ఇతర మండలాల ఆవాహన పూజ జరిగింది.

యజమానులు డా. అనిల్ మిశ్రా, ఇతర యజమానులు తమ అర్ధాంగినులతో కలిసి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఆచార్య చంద్రభాన్ శర్మ, ఉపాచార్య రవీంద్ర పైఠణే, యజ్ఞ బ్రహ్మ, ఆచార్య పంకజ్ శర్మ పూజలను నిర్వహించారు.  పూజా నిర్వహణ ప్రధాన ఆచార్య ఇంద్రదేవ్ మిశ్రా, ఆచార్య పంకజ్ కౌశిక్ పర్యవేక్షణలో సమస్త అనుష్ఠానాలు శుభంగా పూర్తయ్యాయి. 

ఆలయ నిర్మాణ ద్వజం భూమి నుండి దాదాపు 190 అడుగుల ఎత్తులో ఉండేవిధంగా ఏర్పాటు చేస్తున్నారు. 25న జరిగే ధ్వజారోహణకు గవర్నర్ ఆనంది పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల సమక్షంలో ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ నేతృత్వం వహిస్తారు. ఆలయం లోపల దర్శన కార్యక్రమంలో దాదాపు 6,000 మంది ఆహ్వానిత అతిథులు పాల్గొంటారు. ఆ రోజు రామ జన్మభూమికి ప్రజా ప్రవేశం మూసివేస్తున్నారు. హాజరైన వారి కోసం, 1,600 గదులు రిజర్వ్ చేశారు.