పంజాబ్, హరియాణా సంయుక్త రాజధాని చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చే రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై పంజాబ్‌లో వ్యతిరేకత వస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగుతున్నారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రపతికి చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారం ఉంటుంది.
దీంతో పంజాబ్‌లోని రాజకీయ పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో చంఢీగఢ్పై ఎలాంటి బిల్లు ప్రవేశపెట్టడం లేదని కేంద్రం స్పందించింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ ఆరోపించారు. చండీగఢ్ గతంలో పంజాబ్‌లోని భాగమని, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా పంజాబ్‌తో విడదీయరాని భాగమేనని స్పష్టం చేశారు.
ఆమ్‌ఆద్మీపార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని అభివర్ణించారు. చండీగఢ్ పంజాబ్‌కు చెందినదేనని దానిని లాక్కోవడానికి చేసే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలు ఉంటాయని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. అకాలీదళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ కూడా దీనిని పంజాబ్ వ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు.
మరోవైపు చండీగఢ్ విషయంలో తలెత్తిన గందరగోళం కేంద్రంతో చర్చించి పరిష్కరిస్తామని బిజెపి పేర్కొంది. పంజాబ్ బిజెపి అధ్యక్షుడు సునీల్ జాఖర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి బిల్లును పునఃపరిశీలించాలని, ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తామని చెప్పారు. చండీగఢ్ పరిపాలనా అవసరాలను సులభతరం చేయడానికి పంజాబ్ మనోభావాలను విస్మరించలేమని ఆయన తేల్చి చెప్పారు.
“పంజాబ్‌కు, చండీగఢ్ భౌగోళిక ప్రాంతం కాదు. మన భావోద్వేగాలు రాజధాని నగరంతో ముడిపడి ఉన్నాయి. అలాంటి ఏ ప్రయత్నమైనా పునఃపరిశీలించి ఉపసంహరించుకోవాలి. మేము కేంద్రంతో సమయం కోరాము మరియు పంజాబ్ మనోభావాలకు అనుగుణంగా బిల్లును పునఃపరిశీలించి ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తాము” అని జాఖర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చండీగఢ్ పరిపాలనకు సంబంధించి ఎలాంటి బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని హోంమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ చట్టం రూపొందించే ప్రక్రియను సరళీకరించాలన్న ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది.

More Stories
బెంగాల్ లో 127.7 శాతం పెరిగిన ముస్లిం ఓటర్లు
హిందువులు లేకుండా ప్రపంచం ఉనికిలో ఉండదు!
నాలుగు లేబర్ కోడ్ ల అమలు స్వాగతించిన బిఎంఎస్