దుబాయ్‌ ఎయిర్‌ షోలో కుప్పకూలిన తేజస్‌ ఫైటర్‌ జెట్‌

దుబాయ్‌ ఎయిర్‌ షోలో కుప్పకూలిన తేజస్‌ ఫైటర్‌ జెట్‌

దుబాయ్‌లో జరుగుతున్న ఎయిర్‌ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం కూలిపోయింది. ఎయిర్‌ షోలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రదర్శన జరుగుతుండగా  విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. 

అందులోని పైలట్‌ మరణించాడు. పైలట్‌ను వింగ్‌ కమాండర్‌ నమాంశ్‌ సయాల్‌గా గుర్తించారు. కంగ్రాకు చెందిన సయాల్‌ మృతి పట్ల హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖూ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. జస్‌ యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్‌కు తీవ్ర గాయాలై మరణించినట్లు ఐఏఎఫ్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని కనుగొనేందుకు కోర్టు ఆఫ్‌ ఇంక్వైరీని నియమిస్తున్నట్లు ఐఏఎఫ్‌ పేర్కొంది. 

దుబాయ్‌ వరల్డ్‌ సెంట్రల్‌లోని మక్తూమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రేక్షకుల కోసం గగనంలో విన్యాసాలు నిర్వహిస్తుండగా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో తేజస్‌ విమానం కూలిపోయింది. భూమిపైకి వేగంగా దూసుకొచ్చిన విమానం నేలను తాకిన మరుక్షణం పేలిపోయింది. కిందకు వచ్చే సమయంలో పైలట్‌ బయటపడిన దృశ్యాలేవీ కనిపించలేదు. వెంటనే అత్యవసర సర్వీసు సిబ్బంది విమానం కూలిన ప్రదేశానికి హుటాహుటిన తరలి వెళ్లారు.

“దుబాయ్‌ ఎయిర్‌షోలో తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్‌కు తీవ్ర గాయాలై మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో పైలట్‌ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతాం” అని భారతీయ వాయుసేన తెలిపింది.

ద్వైవార్షిక దుబాయ్‌ ఎయిర్‌ షోని నగరంలోని రెండవ విమానాశ్రయం నిర్వహిస్తోంది. ఎమిరేట్స్‌, దాని అనుబంధ ఎయిర్‌లైన్‌ ఫ్లై దుబాయ్‌ నుంచి విమానాల కొనుగోలు కోసం ఈ ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. తేజస్‌ యుద్ధ విమానాలను ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ డిజైన్‌ చేయగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) తయారుచేసింది.

విదేశీ ఇంజిన్‌తో నడిచే తేజస్‌ భారత్‌లో తయారైన మొదటి స్వదేశీ యుద్ధ విమానం. ప్రస్తుతం ఎంకే1 రకం తేజస్‌ ఫైటర్‌ జెట్లను ఐఏఎఫ్‌ ఉపయోగిస్తోంది. ఎంకే1ఏ రకం ఫైటర్‌ జెట్ల రాక కోసం ఎదురుచూస్తోంది. 2010వ దశకంలో ఐఏఎఫ్‌లోకి చేర్చుకున్న తర్వాత తేజస్‌ కూలిపోవడం ఇది రెండవసారి. గత ఏడాది మార్చిలో జైసల్మేర్‌ సమీపంలో తేజస్‌ ఫైటర్‌జెట్‌ కూలిపోయింది. అయితే పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. హెచ్‌ఏఎల్‌ నుంచి 97 తేజస్‌ ఫైటర్‌ జెట్లను ఐఏఎఫ్‌ సమీకరించనున్నది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ ఇందు కోసం హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2027లో వాటి సరఫరా ప్రారంభం కావలసి ఉంది. కాగా, 2021లో ఐఏఎఫ్‌ కోసం 83 తేజస్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు హెచ్‌ఏఎల్‌తో రక్షణ శాఖ మరో ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాదిలో వీటి సరఫరా జరగాల్సి ఉన్నప్పటికీ ఇంజిన్ల కొరత కారణంగా ఆలస్యమైంది. తేజస్‌కు అవసరమైన ఇంజిన్లు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది.

ఏం జరిగి ఉంటుంది?

తేజస్‌ కూలిపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. అయితే దీనికి నిపుణుల అంచనా ప్రకారం బారెల్‌ రోల్‌గా వ్యవహరించే ఓ విన్యాసాన్ని పైలట్‌ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. విమానం తలకిందులుగా పయనించి మళ్లీ యథాస్థితికి రావడాన్ని బారెల్‌ రోల్‌ అని పిలుస్తారు. ఈ విన్యాసంలో విమానం పూర్తిగా తలకిందులై కొద్ది సేపటి తర్వాత పైకి లేచి తిరిగి పూర్వ స్థితికి వస్తుంది.

ఈ సమయంలో పైలట్‌ కూడా కొద్ది సేపు తలకిందుల స్థితిలోనే విమానాన్ని నడపవలసి ఉంటుంది. శుక్రవారం ఎయిర్‌షోలో తేజస్‌ను నడుపుతున్న పైలట్‌ కూడా ఇదే విన్యాసం చేసేందుకు ముందుగా విమానాన్ని పైకి లేపాడు. విమానాన్ని తలకిందులు చేసి కిందకు తీసుకువచ్చాడు. అయితే తిరిగి పైకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో అది సాధ్యంకాకపోవడంతో విమానం వేగంగా భూమి పైకి దూసుకువచ్చి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రమాదానికి కారణాన్ని ఐఏఎఫ్‌ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.