జేడీయూ శాసనసభాపక్ష నేతగా నీతీశ్

జేడీయూ శాసనసభాపక్ష నేతగా నీతీశ్
జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌ను బిహార్‌ శాసనసభాపక్షనేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నట్లు మంత్రి శ్రవణ్​ తెలిపారు. మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేతగా మాజీ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ ఎన్నికయ్యారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఉపశాసనసభాపక్షనేతగా ఎంపికయ్యారు.
 
వీరిని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు ఉత్తర్​ప్రదేశ్​ ఉప ముఖ్యమంత్రి  కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.  అనంతరం కూటమిలోని పార్టీల నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నితీష్ ను ఎన్డీయే నాయకుడిగా ఎన్నుకోనున్నారు.  నీతీశ్ కుమార్ సాయంత్రం గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్‌ను కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని అభ్యర్థిస్తారని జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా తెలిపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయేలోని అన్ని పార్టీల మద్దతు లేఖను కూడా నీతీశ్ కుమార్ గవర్నర్‌కు సమర్పిస్తారని చెప్పారు. 
 
గురువారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నీతీశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నీతీశ్ నేతృత్వంలోని ఎన్డీయే 202 సీట్లను కైవసం చేసుకుంది.