అమెరికాలో ప్రతిభావంతులు లేరు.. విదేశీ ప్రతిభ అవసరమే

అమెరికాలో ప్రతిభావంతులు లేరు.. విదేశీ ప్రతిభ అవసరమే
హెచ్‌-1బీ వీసాల విషయంలో కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా తన స్వరం మార్చారు. విదేశీ ఉద్యోగుల నియామకాన్ని ఆపాలంటూ టెక్‌ సంస్థలను ఆదేశించిన ఆయన ఇప్పుడు అమెరికాకు విదేశీ ప్రతిభ అవసరమేనని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోఅమెరికాలో అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని, అందకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికాకు తీసుకురావడం కోసం విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమేనని తెలిపారు.
 
“సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేం. రక్షణ రంగానికి చెందిన జార్జియాలోని ఓ ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో విదేశీ కార్మికులను తొలగించడం వల్ల ఉత్పత్తుల తయారీలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. అమెరికన్ కార్మికుల వేతనాలను పెంచడానికి మద్దతిస్తాం. దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన కార్మికులు బ్యాటరీలను తయారుచేయడంలో చాలా ప్రతిభ కలిగి ఉంటారు. అటువంటి పరిశ్రమలకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. శిక్షణ లేని, దీర్ఘకాలిక నిరుద్యోగ కార్మికులతో ఆ స్థానాలను భర్తీ చేయలేం” అని ట్రంప్ స్పష్టం చేశారు.

1990లో ప్రారంభమైన హెచ్-1బి వీసా కార్యక్రమాన్ని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకువచ్చారు. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్​-1బీ వీసా విధానంపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.  హెచ్‌-1బీ వీసా రుసుము ఇప్పటివరకు దాదాపు రూ.1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దానిని రూ.88 లక్షలకు పెంచింది ట్రంప్ సర్కార్.

ప్రస్తుతం హెచ్​-1బీ వీసాలు ఉన్నవారు భారత్‌ లేదా విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆందోళనతో తిరిగి రావాల్సిన పనిలేదని చెప్పింది. ముఖ్యంగా ఈ వీసా కార్యక్రమం కింద భారత్‌కు చెందిన అనేక కంపెనీలు ప్రయోజనం పొందుతూ, వేలాది మంది నిపుణులను అమెరికాకు పంపిస్తున్నాయి. ఏడాదికి సుమారుగా 6,50,000 వీసాలను అందిస్తుండగా, మరో 20,000 వీసాలను అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన వారికి అదనంగా కేటాయిస్తారు. అమెరికా ప్రభుత్వం​ తీసుకున్న కఠిన నిర్ణయాలు వల్ల అమెరికాలో ట్రంప్​పై వ్యతిరేకత, చట్టసభ్యుల నుంచి వస్తున్న డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా హెచ్​-1బీ వీసాపై చేసిన వ్యాఖ్యల్లో కొంత మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.