శిక్షలు పడిన ఖైదీలు, రేపిస్టులు, నేరస్తులు జైలులో దర్జాగా మొబైల్ ఫోన్లలో మాట్లాడుతున్నారు. ఎంచక్కా టీవీలు చూస్తూ సమయం గడుపుతున్నారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఖైదీలు మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు.
టీవీలు చూస్తున్నారు. 1996-2022 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేయడంతోపాటు వారిలో 18 మందిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఉమేష్ రెడ్డికి తొలుత కోర్టు మరణశిక్ష విధించింది. అయితే దానిని 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా సుప్రీంకోర్టు మార్పు చేసింది. కాగా, బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉమేష్ రెడ్డి మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించాడు.
జైలు లోపల రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్‌ను అతడు వినియోగిస్తున్నాడు. ఉమేష్ రెడ్డిని ఉంచిన సెల్‌లో టీవీ కూడా ఉన్నది. రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో అరెస్టైన తరుణ్ రాజు కూడా జైలులో మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నాడు. అతడ్ని ఉంచిన సెల్‌లో వంట కూడా చేసుకుంటున్నాడు. ఇతర ఖైదీల వద్ద కూడా మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
మరోవైపు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఖైదీలు, సీరియల్ రేపిస్టులు, హంతకులు, నేరగాళ్లు మొబైల్ ఫోన్లు వినియోగించడం, దర్జాగా ఎంజాయ్ చేసే వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ జైలులో భద్రతా లోపాలు బయటపడ్డాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

More Stories
భారత్ లో ఉగ్రవాదం వెనుక పాక్ ఐఎస్ఐ సీక్రెట్ యూనిట్ ‘ఎస్1’
బీహార్ లో రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు!
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు