డిసెంబ‌ర్ 1 నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు

డిసెంబ‌ర్ 1 నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబ‌ర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వ‌ర‌కూ ఈ స‌మావేశాలు కొన‌సాగ‌నున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని కేంద్ర మంత్రి, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు శ‌నివారం ప్ర‌క‌టించారు.
 
 ‘పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌కు లోబ‌డి డిసెంబ‌ర్ 1 నుంచి 19 వ‌ర‌కూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు’ అని ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు. రాబోయే పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అర్థవంతమైన ఫలితాలను నిర్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన చెప్పారు. 

జులై 21వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, షెడ్యూల్ ప్రకారం ముగియడానికి ఒక రోజు ముందుగా ఆగస్టు 21వ తేదీన ముగిశాయి. లోక్‌సభ, రాజ్యసభ రెండు కూడా నిరవధికంగా వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాల్లో 21 రోజులపాటు సభలు నడిచాయి.  బిహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణపై చర్చ కోసం ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో సెషన్ నిరంతరం అంతరాయం కలిగింది. పదే పదే వాయిదా పడటం వల్ల, లోక్‌సభ ఉత్పాదకత దాదాపు 31 శాతం ఉండగా, రాజ్యసభ ఉత్పాదకత దాదాపు 39 శాతంగా ఉంది.

అదే సమయంలో పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో 14 బిల్లులు ప్రవేశపెట్టగా, 12 బిల్లులు దిగువ సభ, 15 బిల్లులు ఎగువ సభ ఆమోదించాయి. “మొత్తంగా, 15 బిల్లులు  పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఆమోదం పొందాయి. ఒక బిల్లును లోక్‌సభ నుంచి కేంద్రం ఉపసంహరించుకుంది” అని పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.