జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కొమ్ముకాస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, కూడబలుక్కునే ఒకరికొకరు తిట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు.
“మేం ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారు. ఈరోజు మీనాక్షిపురం(రహమత్ నగర్)లో సాయంత్రం సభకు పర్మిషన్ ఇవ్వాలని ఈనెల 4న దరఖాస్తు చేసుకున్నాం. నిన్నటిదాకా దీనిపై స్పందించలేదు. కానీ పొద్దున ఫోన్ చేసి అనుమతి ఇవ్వడం లేదని, వేరేచోట పెట్టుకోవాలని చెబుతున్నారు. మేం ఎక్కడ సభ పెట్టుకోవాలో కూడా వాళ్లే మాకు చెబుతున్నరంటే ఏమనాలి?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్ కు అనుమతి ఇస్తున్నారని, చివరి నిమిషంలో ఎక్కడైనా అనుమతి ఇచ్చినా కండీషన్లు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డీజేలు పెట్టుకోవడానికి, హంగామా చేయడానికి మాత్రం అనుమతి ఇస్తారని చెబుతూ ఇదేం ద్వంద్వ వైఖరి? అని నిలదీశారు.
బీజేపీ సభలకు అనుమతిస్తే ఒక వర్గం ఓట్లు రావనే భయం కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు పట్టుకుంని సంజయ్ మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లను బీజేపీ గెలుచుకుందని గుర్తు చేస్తూ జూబ్లిహిల్స్ లో బీజేపీ గెలవకూడదనే కుట్రతోనే తమ సభలకు అనుమతి ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. దొంగ సర్వేల పేరుతో బీజేపీ పోటీలో లేదంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఆలోచన మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నాయని స్పష్టం చేశారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఐఎంసీ(ఇండియన్ ముస్లిం కాంగ్రెస్) మధ్యే పోటీ అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కు ముస్లిం ఓట్లు కోసం మాత్రమే యత్నిస్తోందని చెబుతూ హిందువులంతా తమ సత్తా ఏమిటో కాంగ్రెస్ కు రుచి చెప్పాలని సంజయ్ కోరారు.
బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందే చేతులెత్తేసిందని తెలిపారు. జూబ్లిహిల్స్ ప్రజలారా అభివ్రుద్ధి కావాలా? అరాచక కావాలా? తేల్చుకోండని ఆయన కోరారు. కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లే, అరాచకాలు, అక్రమాలకు తావిచ్చినట్లే అని స్పష్టం చేశారు.

More Stories
ఘనంగా వందేమాతరం @150 వార్షికోత్సవం ఉత్సవాలు
రేవంత్‌కు దమ్ముంటే గోపీనాథ్ మృతిపై విచారణ జరిపించాలి
ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే తిరుమలలో దర్శనం