మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు

మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌కు బహిరంగంగా నడిరోడ్డుపైనే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హిస్టారిక్ డౌన్‌టౌన్‌లో మంగళవారం ఆమె ప్రజలతో బహిరంగంగా మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె వెనుక నుంచి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా తాకడానికి ప్రయత్నించాడు. 
 
ఈ సంఘటనకు ఆమె ఒక్కసారిగా షాక్ అయింది.  దీంతో అమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడ్ని పక్కకు నెట్టేశారు. అయినా కానీ వాడు మాత్రం వేధింపులు ఆపలేదు. అధ్యక్షురాలి ఒంటిపై ఎక్కడెక్కడో చేతులు వేసి అసభ్యంగా తాకుతుండటంతో ఆమె ఇబ్బంది పడ్డారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
మెక్సికో నగర మేయర్ క్లారా బ్రుగాడా రాత్రికి రాత్రే ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. షీన్‌బామ్ తాను ఇలాంటి వేధింపులకు గురికావడం ఇదే మొదటిసారి కాదని, ఈ సమస్య అధ్యక్షుడి పరిధిని దాటి వెళ్ళిందని నొక్కి చెప్పారు. “ఆ స్థలాన్ని ఉల్లంఘించే హక్కు ఏ పురుషుడికీ లేదు” అని ఆమె స్పష్టం చేశారు. “నేను ఒక మహిళగా అనుభవించినది, కానీ మన దేశంలో మహిళలుగా మనం అనుభవించేది ఇదే కాబట్టి నేను అభియోగాలు మోపాలని నిర్ణయించుకున్నాను” అని ఆమె తెలిపారు. “నేను అధ్యక్షురాలిని కానప్పుడు, విద్యార్థిగా ఉన్నప్పుడు నేను దీనిని ఇంతకు ముందు కూడా అనుభవించాను” అని వివరించారు.
 
దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశాధినేతకే భద్రత లేకపోతే సాధారణ మహిళల పరిస్థితేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తి అధ్యక్షురాలి వద్దకు వచ్చేవరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, సెక్యూరిటీ   నిందితుడు అధ్యక్షురాలిపై చేతులు వేసి ముద్దుపెట్టే ప్రయత్నం చేస్తుంటే చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులోఉన్నాడని స్థానిక అధికారులు పేర్కొన్నారు.  మిచోకాన్ రాష్ట్రంలో హింసను అరికట్టేందుకు ఆమె కొత్త భద్రతా వ్యూహాన్ని ప్రకటించిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. 
 
మిచోకాన్‌లో గత మూడేళ్లలో ఏడుగురు మేయర్లు హత్యకు గురికావడంతో ప్రజాగ్రహం పెరిగింది. నవంబరు 1న యూరుఆపాన్ మేయర్ కార్లోస్ అల్బెర్టో మాంజోపై డ్రగ్స్ ముఠాలు దాడికి పాల్పడ్డాయి. దీంతో ప్రభుత్వ భద్రతా విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిరసనగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.