బీహార్ ఉప ముఖ్యమంత్రి సిన్హా కాన్వాయ్‌పై రాళ్లదాడి

బీహార్ ఉప ముఖ్యమంత్రి సిన్హా కాన్వాయ్‌పై రాళ్లదాడి

బిహార్​లో అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ జరుగుతున్న వేళ లఖిసరాయ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాన్యాయ్​పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. కారుపై మట్టి, ఆవు పేడ, చెప్పులను విసిరారు. విజయ్ సిన్హాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే తనపై ఆర్​జేడీ మద్దతుదారులే దాడి చేసినట్లు అని విజయ్​ కుమార్ సిన్హా ఆరోపించారు. 

దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గురువారం విజయ్​ కుమార్ సిన్హా లఖిసరాయ్‌ నియోజకవర్గంలోని ఖోరియారీ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయడానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దాదాపు 50-60 మంది బ్లూత్​ నవంబర్​ 404,405 వద్దకు వచ్చారు. వారు విజయ్​ సిన్హా వాహానాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు. 

చెప్పులు, ఆవు పేడను కారుపైకి విసిరారు. రాళ్లతో కూడా దాడి చేశారు. వెంటనే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్​జేడీ అధికారంలోకి వస్తే ఆటవికి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని విజయ్​ సిన్హా ధ్వజమెత్తారు. 

“నా కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ విసిరారు. రాళ్లతో కూడా దాడి చేశారు. ఆర్​జేడీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వీరు ఆర్​జేడీ గూండాలు. ఎన్​డీఏ అధికారంలోకి వస్తోంది. అందుకే వారు గూండాయిజానికి పాల్పడుతున్నారు. వారు పోలింగ్ ఏజెంట్​ను తరిమికొట్టి, ఓటు వేయడానికి అనుమతించలేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“పోలింగ్​ బూత్​ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఈ గూండాలు అధికారంలోకి రాకముందే బిహార్​ ఉప ముఖ్యమంత్రిని గ్రామంలోకి ప్రవేశించనివ్వడం లేదు. ఇక్కడి పోలీసు సూపరింటెండెంట్ పిరికివారు. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే మేం ఇక్కడ నిరసన తెలుపుతాం. ఇలాంటి పరిపాలన సిగ్గుచేటు” అని విజయ్​ సిన్హా మండిపడ్డారు.

మరోవైపు ఈ ఘటనపై  తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్ ఆదేశించినట్లు ఈసీ అధికారి తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరూ అనుమతించరని పేర్కొన్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై లఖిసరాయ్‌ ఎస్​పీ అజయ్​ కుమార్ స్పందిస్తూ ఉదయం అంతా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, కానీ విజయ్ కుమార్ సిన్హా వచ్చినప్పుడే అకస్మాత్తుగా నిరసనలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  లిఖిసరాయ్​ నియోజకవర్గంలో విజయ్​కుమార్​ సిన్హా వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. ఈసారి ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జాన్ సూరజ్​ పార్టీకి చెందిన సూరజ్ కుమార్‌ను ఆయన ఎదుర్కొంటారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన అమ్రేశ్ కుమార్ పోటీ చేశారు.