ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి దార్శనికుడని, మహిళల విముక్తి కోసం కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన స్థాపించిన సంస్థలు దేశానికి సేవ చేస్తూనే ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య సమ్మేళనంలో ప్రధాని పాల్గొంటూ భారతీయ విలువల గురించి ఏమాత్రం భయపడకుండా మాట్లాడిన సంస్థ ఆర్యసమాజ్ అని ప్రశంసించారు.
ఆర్యసమాజ్ 150వ వార్షికోత్సవం కేవలం సమాజంలోని ఒక భాగానికి లేదా ఒక వర్గానికి సంబంధించిన సందర్భం కాదని, యావత్ దేశానికి చెందిన వైదిక గుర్తింపుతో ముడిపడిన అంశమని ప్రధాని మోదీ చెప్పారు. “మహర్షి దయానంద సరస్వతికి శిరస్సు వంచి నా నివాళులు అర్పిస్తున్నాను. దయానంద సరస్వతి జన్మస్థలమైన గుజరాత్లో గతేడాది ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు” అని చెప్పారు.
“అంతకుముందు ఢిల్లీలోనే మహర్షి దయానంద సరస్వతి 200 జయంతి వేడుకలను నిర్వహించారు. దానికి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ సమయంలోనే వచ్చే రెండేళ్ల పాటు జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించాలని మనమందరం అనుకున్నాం.” అని నరేంద్ర మోదీ గుర్తు చేశారు.
“దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ కారణాల వల్ల స్వాంతంత్ర్య ఉద్యమంలో ఆర్య సమాజ్కు రావాల్సినంత గౌరవం దక్కలేదు. ఇప్పటికీ ఆర్యసమాజ్ అంటే దేశభక్తులతో కూడిన గొప్ప సంస్థ. ఆర్యసమాజ్ ఎలాంటి భయం లేకుండా భారతీయ విలువల గురించి పోరాడింది. భారత వ్యతిరేక ఆలోచన విధానం, విదేశీ సిద్ధాంతాలను ఆర్యసమాజ్ ప్రశ్నించింది. అలాంటి ఆర్యసమాజ్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.
అంతకుముందు మహర్షి దయానంద సరస్వతి 200 జయంతి, ఆర్య సమాజ్ 150 వార్షికోత్సవం సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను గుర్తిస్తూ నాణేలను విడుదల చేశారు.

More Stories
ప్రజాస్వామ్యంలో పెరిగిపోతున్న వర్గ రాజకీయాలు
కేజ్రీవాల్ కోసం ఛండీగఢ్లో మరో శీష్ మహల్
బీహార్ ఎన్నికల ఎన్డీయే మేనిఫెస్టోలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు