 
                బిహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను సంకల్ప్ పత్ర పేరుతో అధికార ఎన్డీఏ కూటమి శుక్రవారం పట్నాలో విడుదల చేసింది. రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర యువతకు కోటికిపైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇతరత్రా ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపింది.
వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ఉద్యోగాల హామీతో పాటు కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడమే తమ లక్ష్యమని ప్రకటించింది. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2లక్షల వరకు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో మెగా లెర్నింగ్ సెంటర్లతో బీహార్‌ను ప్రపంచ అభ్యాస కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలిపింది.
నైపుణ్యం ఆధారంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో స్కిల్స్ సెన్సస్ను నిర్వహిస్తామని పేర్కొంది. ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్‌గా బిహార్‌ను మారుస్తామని తెలిపింది.
ఈబీసీలకు రూ.10లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, ప్రతి రైతుకు ఏడాదికి రూ.9వేల పెట్టుబడి సాయం, బీహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, నాలుగు నగరాల్లో (పాట్నా, దర్భంగా, పూర్ణియా, భాగల్పూర్) అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో రైలు సేవల ఏర్పాటు, 3,600 కి.మీ రైలు మార్గాలను ఆధునీకరించడం వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, కేంద్ర మంత్రి, హిందుస్తాన్ అవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్, ఆర్‌ఎల్ఎం పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వాహ, ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా పలువురు ముఖ్య నేతలు కలిసి 69 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు.
కాగా, విపక్ష ఇండియా (మహాగఠ్‌బంధన్) కూటమి మంగళవారం (అక్టోబరు 28న) రోజు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బిహార్ కా తేజస్వి ప్రణ్ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోగా ఈ మేనిఫెస్టోను అమల్లోకి తెస్తూ ఆదేశాలు ఇస్తానని విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని వెల్లడించారు.





More Stories
సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
ముంబైలో పిల్లలను బందీలుగా తీసుకున్న ఆర్య కాల్చివేత
రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు