జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్

జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఒకొక్క డివిజన్ కు ఇద్దరేసి మంత్రులను చొప్పున మోహరింపచేసినా గెలిచే అవకాశాలు కనిపించక పోవడంతో ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అర్ధాంతరంగా మంత్రివర్గ విస్తరణకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా మంగళవారం ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రచార సభకు స్పందన కనిపించక పోవడంతో అధికార పక్షంలో ఆందోళన వెల్లడి అవుతుంది. 
పార్టీ అధిష్టానం జరిపిస్తున్న సర్వేలలో సహితం ఊహించని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి వ్యక్తం అవుతుండటంతో దిక్కుతోచడం లేదు.  ముఖ్యంగా నియోజకవర్గంలోని సుమారు లక్ష మంది వరకు ఉన్న మైనార్టీల నుంచి మద్దతు కోసం ఎంఐఎంతో అవగాహనకు రావడం, దానితో ఎంఐఎం పోటీలో లేకుండా గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దింపడం చేశారు. అయినప్పటికీ మైనారిటీలలో మూడోవంతు మందికన్నా కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇచ్చే అవకాశం లేదని పలు సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. 
 
దీంతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానంలో కలవరం మొదలైంది. మైనార్టీల మద్దతు లేకుండా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీంతో రాత్రికి రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి మైనార్టీలను ఏ విధంగా మచ్చిక చేసుకోవాలనే అంశంపై అధిష్ఠానం పెద్దలతో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. అధిష్టానం ఆదేశాలతో తెల్లారేసరికి స్థానిక నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 
 
ఈ మేరకు పార్టీ, ప్రభుత్వ పెద్దలు మీడియాకు లీకులు ఇచ్చారు. అజారుద్దీన్‌ శుక్రవారం మంత్రిగా ప్రమాణం చేస్తారన్నది లీకుల ఉద్దేశం. అజారుద్దీన్‌కు మంత్రి ఇవ్వడం ద్వారా నియోజకవర్గంలోని మైనార్టీలను మచ్చిక చేసుకొని వారి ఓట్లకు గాలం వేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా పేరున్న అజారుద్దీన్‌ ఇటీవలి కాలంలో పార్టీలో ఘోర అవమానాలను ఎదుర్కొన్నట్టు చర్చ జరుగుతున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను దూరంగా పెడుతూ వచ్చారు. గత ఏడాది లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుండి పోటీచేసేందుకు సిద్దపడగా అనూహ్యంగా బిఆర్ఎస్ ఎమ్యెల్యేగా ఉన్న దానం నాగేందర్ ను ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి పరభావంకు గురయ్యారు.  జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక అనివార్యం అని తెలియగానే తానే అభ్యర్థిని అంటూ అజారుద్దీన్ తిరిగారు. అయితే వ్యూహాత్మకంగా ఆయనకు నియోజకవర్గంతో సంబంధం లేకుండా చేశారు. ఎంఐఎం సిఫార్సుతో నవీన్ యాదవ్ ను రంగంలోకి తీసుకొచ్చి ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కకుండా చేశారు. చివరకు ప్రచారంలో కూడా ఇప్పటివరకు ఎవ్వరూ ఆయనను పట్టించుకోలేదు.
అందుకే ఉప ఎన్నికల ప్రచారంలో అజారుద్దీన్‌ ఎక్కడా కనిపించలేదు.  అజార్‌కు జరుగుతున్న అవమానాలపై ఆయన వర్గంతోపాటు నియోజకవర్గంలోని మైనార్టీల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదనే చర్చ జరుగుతున్నది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌ ఆ తర్వాత కూడా నియోజకవర్గాన్ని వీడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
జూబ్లీహిల్స్‌ టికెట్‌కు బదులుగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. అయితే  ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అజార్‌ తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికపై బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన కేసులో నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనకు అమలుకాని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మోసం చేశారనే ఆవేదనతో అజారుద్దీన్‌ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలకు ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు.
 
అనివార్య పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కూడా కాని అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందా? అన్న అనుమానాలు పార్టీల్లో వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజ్యాంగం ప్రకారం ఆరు నెలలలోపు ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో ఎన్నికవ్వాలి. 
 
గవర్నర్‌ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అది ఎప్పటికి తేలుతుందో తెలియదు. ఒకవేళ ఆరు నెలలలోపు తీర్పు రాకుండా, ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవి ఊడుతుంది. ఈ విధంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనను బలిచేస్తుందా? అనే అనుమానాలతో ఆయనను మంత్రివర్గంలో చేర్చుకోవడం ఏమేరకు ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ప్రయోజనం కలిగిస్తుందో ప్రశ్నార్ధకంగా మిగిలిపోయే అవకాశం ఉంది.