లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్

లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఏపీ మంత్రివర్గ సమావేశంలో  లులూ గ్రూప్‌కు భూకేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు ప్రశ్నలు లేవనెత్తిన్నట్లు తెలుస్తున్నది. మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రావడంతో లులూ సంస్థ తమ పెట్టుబడుల విషయంలో కోరుతున్న అంశాలు, షరతుల పైన అధికారులు వివరించారు. వాటిపై పవన్‌ కల్యాణ్‌ వరుస ప్రశ్నలు సంధించారు. పలు సందేహాలు లేవనెత్తారు. 
 
మెగా ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? అని ప్రశ్నించారు. అలా చేస్తే తాము వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పారు. అదే విధంగ లులూ లో ఉద్యోగాల పైన పవన్ కీలక సూచనలు చేశారు. స్థానికులకు ఏమాత్రం అవకాశం ఇస్తారని నిలదీశారు.  మంత్రివర్గ సమావేశంలో లులూ సంస్థకు కేటాయింపులు, మినహాయింపుల పైన చర్చ సమయంలో కృష్ణాజిల్లా మల్లవల్లి మెగా ఫుడ్‌ పార్కులో లులూగ్రూప్‌లో భాగమైన మెస్సర్స్‌ ఫెయిర్‌ ఎక్స్‌పోర్ట్స్‌కు 7.48 ఎకరాలను కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. 
 
దీంతో ఆహారశుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు బదులివ్వగా ఆహారశుద్ధి అని ఊరికే అంటే కుదరదు, అక్కడ అసలు ఏం పని చేస్తారు? కూరగాయలు, పండ్లు సాగుచేస్తారా? ఉద్యానవన పంటలు సాగుచేస్తారా? లేక కబేళాను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా? అని పవన్‌ సూటిగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పారు. దీంతో అధికారులు నీళ్లు నమిలారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టంచేసినట్లు సమాచారం. అక్కడ ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 

 
మామిడి, బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్‌ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత లులూ గ్రూప్‌ వ్యవహారశైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్‌ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్‌ ప్రస్తావించారు. లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5 శాతం మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం 3 ఏళ్లకు 10 శాతం పెంచాలి కదా? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కాగా, రాష్ట్రంలోని విశాఖపట్నం ముంబై తరహాలో అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్​గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. 2028 నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని భవిష్యత్తులో విశాఖ ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

పశ్చిమలో ముంబై ఎలాంటి మహానగరమో తూర్పులో విశాఖ అంతటి మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. వచ్చే15ఏళ్లలో విశాఖ మహా నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుందని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా ప్రస్తుతం 4.7లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచాలని అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటంతో పాటు రైల్వే జోన్ సాధన వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకోవాలని సూచించారు.