
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి దశకు నామినేషన్ల పక్రియను ప్రారంభిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించిన కొన్ని గంటలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధించింది.
నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ తరువాత ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 9ని జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య, వీ హన్మంతరావుతో పాటు పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. ఆయా అన్ని పిటిషన్లను సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించింది. తాజాగా రిజర్వేషన్ల అంశంపై గురువారం సైతం వాదనలు కొనసాగాయి.
న్యాయస్థానంలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందని ఆయన అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్లుగా తేలిందన్న ఆయన 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు న్యాయస్థానానికి వివరించారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే అసెంబ్లీ తీర్మానం చేసిందని సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
మరో న్యాయవాది రవివర్మ హైకోర్టులో తన వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతంతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని తెలిపారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్గానే ఉందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది
More Stories
భారత్ లో తొమ్మిది యుకె విశ్వవిద్యాలయాల క్యాంపస్ లు
దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం