శతాబ్దిలో ఆర్ఎస్ఎస్, సిపిఐ … వారెక్కడ? వీరెక్కడ?

శతాబ్దిలో ఆర్ఎస్ఎస్, సిపిఐ … వారెక్కడ? వీరెక్కడ?

ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రత్యేకం.. 5

డా. దుగ్గరాజు శ్రీనివాసరావు
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్), భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రెండు నెలల తేడాలో 1925లో ప్రారంభమయ్యాయి. ఒకటి సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ, రెండవది రాజకీయ పార్టీ. ఆ రెండూ ఈ సంవత్సరం శతసంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ ‘వారెక్కడ, మనమెక్కడ’ అనే మాట వామపక్ష భావజాలికుల నోటి వెంట వినిపిస్తున్నది.
ఈ మాటను విజయవాడ నగరంలో సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో, విప్లవ రచయితల (విరసం) 29వ మహాసభలోనూ విన్నాను. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేక, విప్లవ మార్గమే సరైనదని, ఆయుధ పోరాటాలే ప్రజా సమస్యలకు పరిష్కారం అని నినదించే వారంతా ఆ వేదిక మీద ఉన్నారు. చాలామంది ప్రసంగించారు కానీ, అందులో ఎక్కడా రాజ్యాంగబద్ధ పోరాటం చేద్దామన్న మాట లేదు.
‘విరసం’ నాకేమీ కొత్త కాదు. 20 ఏళ్ల క్రితం ఇదే వేదిక మీద వారు జరిపిన సమావేశంలోనూ నేను శ్రోతగా ఉన్నాను. నాటికీ నేటికీ వచ్చిన మార్పు-పడికట్టు పదాలు కొత్తవి వినిపించటమే. నాడు కాంగ్రెస్‌ని తిట్టిన నోర్లు నేడు బీజేపీని తిట్టాయి. నాడు ఇందిరను ఫాసిస్ట్‌ అన్న గొంతుకలు నేడు మోదీని అంటున్నాయి. అవన్నీ పక్కన పెడితే, కొందరు యువ నాయకులు చేసిన ప్రసంగాలు నన్ను ఆకట్టుకున్నాయి.
రాంకీ అనే అతను ‘‘మనము, వారు 1925లోనే ప్రారంభమయ్యాం. కానీ ఇప్పుడు వారెక్కడ ఉన్నారు, మనమెక్కడ ఉన్నాం’’ అనే ప్రశ్న వేశాడు. అది కమ్యూనిస్టు, ఆరెస్సెస్‌లను పోల్చి వేసిన ప్రశ్న.  ఆయన వేసిన మరో ప్రశ్న ‘‘మన భావజాలంతో మన ఇళ్లలోని వారినే ప్రభావితం చేయలేకపోతున్నాం. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ వేళ ఇంటింటా దీపాలు వెలిగించమని ఆరెస్సెస్‌ పిలుపునిస్తే, మా ఇంటిలోనూ వెలిగించారు. వెలిగించవద్దు అంటే… ‘దీపాలు వెలిగిస్తే తప్పేమిటి? రోజూ వెలిగిస్తూనే ఉన్నాం కదా! ఈ రోజు కొంచెం ఎక్కువ దీపాలు వెలిగిస్తాం… అంతేకదా’ అని మా ఆడవారి నుంచి ప్రశ్న వచ్చింది. మన దగ్గర సమాధానం ఉందా?’’ అన్నది ఆయన ప్రశ్న.
తమ సాటి సభ్యుడు లేవనెత్తిన ప్రశ్న మీద ఆ సంస్థలో చర్చ జరిగిందని అనుకోలేం. పడికట్టు నినాదాలైన ‘కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజాన్ని ఓడిద్దాం’, ‘ఆదివాసులపై హిందుత్వ ఫాసిస్టుల వైమానిక దాడులను ఖండిద్దాం’ అనేవి మాత్రం ఎప్పటిలాగానే వినిపించారు.   ఆ వేదిక మీద నర్మద అనే ఆమె విప్లవోద్యమంలో మహిళలను ఎలా ఉపయోగించుకుంటున్నదీ ఎత్తి చూపింది. మహిళలను అవమానపరుస్తున్నారు..మహిళలను ముందు నిలబెట్టి తమ రక్షణకు వాడుకుంటున్నారు అని ఆరోపించినా, ఆమె ప్రసంగాన్ని మధ్యలో ఆపించారే గాని, అటువంటిదేమీ జరగడం లేదని ఎవరూ అనలేదు.

కమ్యూనిస్టు పార్టీ పిడివాదం తమ తప్పులను అంగీకరించలేని స్థితికి చేర్చింది. ఎర్రజెండా ముఖ్య తప్పిదాలు అంటూ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ది టెలిగ్రాఫ్‌ దినపత్రికలో (12–6–2004) ఒక వ్యాసం రాశాడు. అందులో ఆయన కేవలం ఆరు ముఖ్య తప్పిదాల గురించే ప్రస్తావించినప్పటికీ, అటువంటి తప్పులు అనేకం చేసినందునే ఎర్రజెండాకి ఆదరణ తగ్గింది. ఒకప్పుడు కార్మిక రంగాన్ని, విద్యార్థి రాజకీయాలను ఏలిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఎక్కడ?

ఆర్ఎస్ఎస్ స్థాపించిన కార్మిక సంఘం (బీఎంఎస్‌) ఇప్పుడు దేశంలో నెంబర్‌ వన్‌. ఒక్కొక్క విశ్వవిద్యాలయ ఎన్నికలను వరుసగా ఏబీవీపీ గెలుస్తున్న వార్తలు వస్తున్నాయి. చారిత్రక అంశాలు, మేథోవాదనల్లో ఒకనాడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వామపక్షవాదులు, నేడు వెనుకంజ వేయక తప్పలేదు.  ఆర్ఎస్ఎస్ పునాది మీద పుట్టిన బీజేపీ రాజకీయ విజయం తర్వాత మిగిలిన విజయాలు వస్తున్నాయని కమ్యూనిస్టులు సర్ది చెప్పుకోవటం సరికాదు. అన్ని రంగాలలో ఆర్ఎస్ఎస్ కమ్ముకుని వచ్చినందున బీజేపీకి రాజకీయ విజయం సాధ్యమైంది.

ఒక వార పత్రికలో నేను నిర్వహించే ‘చివరి రోజుల్లో’ శీర్షిక కోసం ప్రముఖుల వారసులను ఇంటర్వ్యూ చేసేవాడిని. ఆ వరసలో నేను కొన్ని సంవత్సరాల క్రితం చండ్ర రాజేశ్వరరావు కొడుకు ఆజాద్‌ని విజయవాడలోని వారి ఇంట్లో కలిసేవాడిని. తన తల్లిదండ్రులు ఇరువురూ చివరి రోజుల్లో మఖ్దూమ్‌ భవన్‌, హైదరాబాద్‌లో గడిపారని చెపుతూ, ఆ రోజుల్లో ఆయన రాసిన పుస్తకం అంటూ ఒక చిన్న నోట్‌బుక్‌ చూపించారు.

అందులోని కొన్ని మాటలు కమ్యూనిస్టులకు చేరాయో లేదో నాకైతే తెలియదు. కానీ అవి వారికి తెలియాలి. అందులో ఒక వాక్యం ‘‘ఈ దేశ ప్రజలు ఎక్కువ మంది విశ్వసించే విషయాలను మనం కాదన్నాం, అందుకే ప్రజలు మనల్ని కాదన్నారు’’ అని ఉంది. ఆ విషయం మీద రాజేశ్వరరావు కొడుకుని వివరణ అడిగినప్పుడు కమ్యూనిస్టులు అనవసరంగా మతం కాదన్నారు, సంస్కృత భాషని వద్దన్నారు, వివేకానందుడిని, చివరికి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌నీ తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఆయన చివరి రోజుల్లో తలచుకున్నారని చెప్పారు.

‘వారెక్కడ, మనమెక్కడ’ అనే ప్రశ్నకు చండ్ర రాజేశ్వరరావు ఎంతో ముందుగానే సమాధానం రాసి ఉంచారు. కమ్యూనిస్టుల బలహీనత రోగానికి కారణాలు తెలిశాయి. కాని వాటికి తగిన ఔషధం అందుకునే ధైర్యం ఉందా?! ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రతి దశాబ్దంలో ఒక పెద్ద తప్పు నిర్ణయం చేసుకుంటూ, చీలికలు పేలికలుగా జెండాను చించుకుని, భుజాన మోస్తూ ఇంకా మమ్మల్ని ఆదరించండి అంటే… ఎవరు ఆదరిస్తారు?

(ఆంధ్రజ్యోతి నుండి)