
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం మీడియా సమావేశంలో వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెల్లడించారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు.
మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఐదు దశల్లో జరగుతుందని రాణికుముదిని తెలిపారు. 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల తేదీలివే : ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని రాణికుముదిని తెలిపారు.
అక్టోబర్ 23న తొలి విడత, 27వ తేదీన మలి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత పోలింగ్ నవంబర్ 4వ తేదీన, మూడో విడత నవంబర్ 8వ తేదీన నిర్వహిస్తామన్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని వివరించారు.
నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని రాణికుముదిని వివరించారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎతెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లను గుర్తించామని పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆదివారం సాయంత్రమే గెజిట్లు విడుదల చేసినట్లుగా వివరించారు. అన్ని జిల్లాలు, మండలాల్లో రిజర్వేషన్ల ఖరారు జరిగిందని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది.ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి రూ. 50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా, సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు
ఫిరాయింపు ఎమ్యెల్యేలపై స్పీకర్ విచారణ నేటి నుంచే