
పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్ యూసుఫ్ కఠారియాను బుధవారం జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుల్గాం ప్రాంతానికి చెందిన ఇతడు పహల్గాం దాడికి పాల్పడిన ది రెసిస్టంట్ ఫ్రంట్ ముష్కరులకు కఠారియా ఆయుధాలు సమకూర్చాడు.
ఇతడిని లష్కరే తోయిబా ఉగ్రవాదిగా గుర్తించారు పోలీసులు. దాదాపు ఐదు నెలలుగా టెర్రరిస్టులకు సాయం చేసిన వ్యక్తి కోసం వెతుకుతుకున్న పోలీసులు ఎట్టకేలకు కఠారియాను పట్టుకున్నారు. అతడిని 14 రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కొన్ని నెలల క్రితమే అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి. కుల్గాం అటవీ మార్గంలో టెర్రిరిస్టు గ్రూప్‌ల కార్యకలాపాలకు కఠారియా సహకరించాడు.
అలానే పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22వ తేదీన మతం ఏంటీ? అని అడిగి మరీ 25 మంది హిందూ పర్యాటకులను చంపేసిన ఉగ్రవాదులకు కఠారియానే అన్నీ సమకూర్చాడు. అందుకే అతడిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఆపరేషన్ మహాదేవ్ సమయంలో స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదుల ఆయుధాలు, ఇతర సామగ్రిని వివరంగా విశ్లేషించిన తర్వాత ఉగ్రవాదుల కదలికను సులభతరం చేయడంలో అతని పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిందితుడిని కుల్గాం జిల్లాకు చెందిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాగా గుర్తించారు. అతను సీజనల్ టీచర్‌గా పనిచేస్తున్నాడని అధికారిక వర్గాలు తెలిపాయి. కటారియా సహచరులను గుర్తించేందుకు, విస్తృత ఎల్‌ఇటి (టిఆర్ఎఫ్) నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను ఇటీవల పార్లమెంటు సమావేశాల సమయంలో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంటులో చర్చసాగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
More Stories
దంతెవాడలో లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు
ఇంధన ఎనర్జీ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు
పీసీబీపై చర్యలు తీసుకోవాలన్న సునీల్ గవాస్కర్