హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సి యు) విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్- సేవాలాల్ విద్యార్థి దళ్ (ఎబివిపి- ఎసిఎల్ విడి) కూటమి ఘన విజయం సాధించింది. 45 రౌండ్ల కౌంటింగ్ తర్వాత వామపక్ష విద్యార్థి సంఘాల కూటమిని ఓడించి, ఆరు కీలక స్థానాలను గెలుచుకుంది. అధ్యక్షునిగా శివ పాలేపు, ఉపాధ్యక్షునిగా  దేవేంద్ర, ప్రధాన కార్యదర్శిగా శృతి, సంయుక్త కార్యదర్శిగా సౌరబ్ శుక్ల, క్రీడా కార్యదర్శిగా జ్వాల ప్రసాద్, సాంస్కృతిక కార్యదర్శిగా వీనస్ విజయం సాధించారు.

స్కూల్ స్థాయిలో కౌన్సిలర్లు, బోర్డు మెంబర్లలో విజయం సాధించిన ఏబీవీపీ మెజారిటీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది.   హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులంతా ఏకతాటిగా నిలిచి గత ఆరు సంవత్సరాలుగా ఎన్ఎస్ యుఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన స్టూడెంట్ యూనియన్ వైఫల్యాలను ఎండగడుతూ ఎబివిపిని విద్యార్థులు గెలిపించారు. 

వామపక్ష విద్యార్థి సంఘాలు కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ అనుబంద విద్యార్థి సంఘమైన ఎన్ఎస్ యుఐతో చేతులు కలిపి ఏబీవీపీని ఓడించాలని అనేక కుట్రలకి ఈ విజయం చెంపపెట్టుగా మారింది. కీలక ఆఫీస్ బేరర్ల కోసం మొత్తం 169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సెప్టెంబర్ 19న 29 బూత్‌లలో పోలింగ్ నిర్వహించగా, 81 శాతానికి పైగా విద్యార్థులు ఓటు వేశారు. 
“ఈ విజయం జాతీయవాదం పట్ల విద్యార్థుల నిబద్ధతను,  విభజన రాజకీయాలను సవాలు చేయడానికి ఐక్యంగా చేసిన ప్రయత్నాన్ని సూచిస్తుంది. వామపక్షాలు అధికంగా ఉన్నప్పటికీ, సాంఘిక శాస్త్ర విభాగాలలో ఎబివిపి విజయం సైద్ధాంతిక ప్రభావం నుండి విముక్తి పొందాలనే విద్యార్థుల దృఢ సంకల్పాన్ని నొక్కి చెబుతుంది” అని ఎబివిపి ప్రతినిధి అంతరిక్ష్ తెలిపారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పటికీ కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్ యుఐ నోటా కంటే తక్కువ ఓట్లను పొందటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ఎస్ యుఐ ఎప్పుడూ బలమైన శక్తిగా లేదు, కానీ ఎన్నికల్లో అది ఎల్లప్పుడూ వామపక్ష గ్రూపులతో పొత్తు పెట్టుకుంటుంది.  “క్యాంపస్ లో శాంతిని ప్రోత్సహించడంలో, హెచ్ సి యు భూములను రక్షించడంలో, ఉద్యమాల ద్వారా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఎబివిపి చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలు విస్తృత మద్దతును పొందాయి. ఈ విజయాన్ని హెచ్ సియు చరిత్రలో ఒక మైలురాయి క్షణంగా మార్చాయి” అని ఎబివిపి ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఈ నెల ప్రారంభంలో, విశ్వవిద్యాలయం ప్రస్తుత విద్యార్థి సంఘాన్ని రద్దు చేసి, సుప్రీంకోర్టు ఆదేశించిన లింగ్డో కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా 2025-26కి కొత్త ఎన్నికలను ప్రకటించింది. ఈ దేశంలోని యువతకి ఈ ఎన్నికల ద్వారా జాతీయవాదమే దేశానికి భద్రత అని మరొక్కసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరూపించారు. 
వామపక్ష విద్యార్థి సంఘాలకు అడ్డాగా చెప్పుకునే హెచ్ సియులో భారీ మెజారిటీ మధ్యలో ఏబీవీపీ ప్యానెల్ విజయం సాధించడం చూస్తుంటే వామపక్ష విద్యార్థి సంఘాలకు, వామపక్ష భావజాలానికి ఈ దేశంలో నూకలు చెల్లాయని స్పష్టం అవుతుంది.  కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్ యుఐకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం చూస్తుంటే కాంగ్రెస్ సిద్ధాంతానికి, వారు చేస్తున్న విషప్రచారానికి విద్యార్థులు క్యాంపస్ పరిసరాలలో తిప్పికొట్టినట్లయింది.