జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ

జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
జీఎస్టీ 2.0 సంస్కరణలు పేదల జీవితాల్లో ప్రభావం చూపుతుందని చెబుతూ జీఎస్టీ అమలు గేమ్ ఛేంజర్ గా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందించేలా అవగాహన కల్పించాలని పేర్కొంటూ దీని కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.  జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై ఈనెల 22న యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తామని ప్రకటించారు.
జీఎస్టీ 2.O.ని స్వాగతిస్తూ శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జీఎస్టీ నూతన విధానం, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.  సంస్కరణలకు ఎప్పుడూ తాను మద్దతిస్తానన్న సీఎం, అందుకే జీఎస్టీ 2.Oని స్వాగతిచ్చినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా తనకు దేశం, రాష్ట్రం, ప్రజలే ముఖ్యమని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ సంస్కరణలతో పరోక్ష పన్ను చెల్లింపుదారులు పెద్దఎత్తున పెరిగారని సీఎం తెలిపారు.  
కొత్త పన్నుల వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్లు సమకూరుతుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు చివరి వ్యక్తి వరకు అందేలా చేయడం మన బాధ్యత అని ప్రజా ప్రతినిధులకు సీఎం సూచించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో జీఎస్టీ సంస్కరణలు ఊతమిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. జీఎస్టీ స్లాబుల మార్పుల వల్ల దేశంలోని 140 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొంటూ నూతన సంస్కరణల వల్ల ఏపీకి కొంత నష్టం ఉన్నా, దేశ విశాల ప్రజయోజనాల దృష్ట్యా స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

 దేశంలోని ప్రతి పౌరుడికి లబ్ధి జరిగేలా జీఎస్టీ సంస్కణరణలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పన్నుల భారం తగ్గడం ద్వారా ప్రజలకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేస్తాయని, జీఎస్టీ సంస్కరణల్లో ఒక దానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించినట్లు పవన్ తెలిపారు. సంస్కరణలను ముందుండి నడిపిన నిర్మలా సీతారామన్‌ కృషి అభినందనీయమని, రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని చెప్పుకొచ్చారు.

చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని గుర్తు చేశారు. జీఎస్టీ పన్ను విధానం సులభతరం ద్వారా ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని, వ్యాపారులపై పన్నుల భారం తగ్గి, పన్నుల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల పొదుపు పెంచి, కొనుగోలు శక్తి పెంపొందించేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. 

స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి ఈ సంస్కరణలు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు పెంచి, ఆర్థిక వృద్ధికి దారి తీస్తుందని పవన్ వెల్లడించారు. జీఎస్టీ మార్పులను స్వాగతిస్తూ అసెంబ్లీలో చర్చకు ముగింపుగా ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తీర్మానం ప్రతిపాదించారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబును అభినందిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది