యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థ‌గా ప్ర‌క‌టించిన ట్రంప్‌

యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థ‌గా ప్ర‌క‌టించిన ట్రంప్‌

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్  దేశంలో యాంటీ ఫాసిస్ట్ ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్న యాంటిఫా గ్రూపును కీల‌క ఉగ్ర‌వాద సంస్థ‌గా ప్ర‌క‌టించనున్న‌ట్లు చెప్పారు. త‌న‌కు చెందిన ట్రుత్ సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఆయ‌న కొత్త‌గా ఓ పోస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం ఉటా వాలీ యూనివ‌ర్సిటీలో ప్ర‌సంగిస్తున్న క‌న్జ‌ర్వేటివ్ నేత చార్లీ కిర్క్ హ‌త్య‌కు గురయ్యారు. 

ఈ నేప‌థ్యంలో యాంటిఫా గ్రూపును అణిచివేసేందుకు ఆయ‌న ఆ నిర్ణ‌యం తీసుకున్నారు. వామ‌ప‌క్ష తీవ్ర‌వాదాన్ని అంతం చేస్తాన‌ని గ‌తంలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే కిర్క్ హ‌త్య‌తో మ‌ళ్లీ అంశాన్ని లేవ‌నెత్తిన‌ట్లు అయ్యింది. యాంటిఫా గ్రూపు ఓ జ‌బ్బుప‌డిన‌, ప్ర‌మాద‌క‌ర‌, రాడిక‌ల్ వామ‌ప‌క్ష విధ్వంసం అంటూ ఆయన మండిపడ్డారు. యాంటిఫా ఉద్య‌మాల‌కు నిధులు ఇస్తున్న వారిని ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.

వాస్త‌వానికి యాంటిఫా అనేది పెద్ద ఉద్య‌మ వ్య‌వ‌స్థ ఏమీ కాదు. అలా అని కొట్టిపారేసిది కూడా కాదు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న సామాజిక కార్య‌క‌ర్త‌ల కూడిక‌నే యాంటిఫా. యాంటిఫా ఉద్య‌మానికి జాతీయ నేత అంటూ ఎవ‌రూ లేరు. కానీ ఆ ఉద్య‌మాన్ని ఫాలోఅవుతున్న వాళ్లు స్థానికంగా గ్రూపులుగా ఏర్ప‌డుతున్నారు. గ‌తంలో కూడా యాంటిఫాను ఉగ్ర సంస్థ‌గా ట్రంప్ పేర్కొన్నారు. త‌న తొలి ట‌ర్మ్‌లో మిన్నియ‌పోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్య‌క్తి హ‌త్య‌కు గురైన త‌ర్వాత అమెరికా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిర‌స‌న‌లు హోరెత్తాయి. ఆ స‌మయంలో యాంటిఫాను ఉగ్ర సంస్థ‌గా ప్ర‌క‌టించాల‌ని ట్రంప్ భావించిన‌ట్లు తెలుస్తోంది.

దేశంలో హింస‌కు ఊతం ఇస్తున్న‌, నిధులు స‌మ‌ర్పిస్తున్న‌, మ‌ద్దుత ఇస్తున్న ఎన్జీవో నెట్వ‌ర్క్‌ల ప‌నిప‌డుతామ‌ని కొన్ని రోజుల క్రితం ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో ట్రంప్ యాంటిఫాకు వ్య‌తిరేకంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెండోసారి దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అనేక గ్రూపుల‌ను ఉగ్ర సంస్థ‌లుగా ప్ర‌క‌టించారు. ఆ జాబితాలో డ్ర‌గ్ కార్ట‌ల్స్ కూడా ఉన్నాయి. రెండు రోజుల క్రితం వెనిజులా నుంచి వ‌స్తున్న డ్ర‌గ్స్ బోటును పేల్చిన త‌ర్వాత దాంట్లో ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.