ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు

ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
 
కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు ప్రభుత్వం చేతుల్లో ఉండకూడదని బిజెపి ప్రభుత్వం విధానం తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నేషనల్‌ సెక్యూరిటీ (జాతీయ భద్రతా) రీత్యా స్ట్రాటజిక్‌ సెక్టార్‌ మాత్రం ప్రభుత్వ గుప్పెట్లో ఉంచుకోవాలని అనుకున్నామని ఆమె చెప్పారు.  భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యాన విశాఖలో జరిగిన గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జిసిసి) సమ్మిట్‌ లో ముఖ్యఅతిధిగా మాట్లాడుతూ  “దేశంలో మొట్టమొదటసారిగా కొన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసేందుకు 2021 బడ్జెట్‌లో అనుమతి ఇచ్చాం. తద్వారా మా విధానం ప్రైవేటీకరణ అని చెప్పగలిగాం” అని ఆమె తెలిపారు.
 
దేశంలో మొట్ట మొదటసారిగా 1991లో పివి.నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రారంభించగా 2014లో ఆ సంస్కరణలను బిజెపి ప్రభుత్వం వేగవంతం చేసిందని  కేంద్ర మంత్రి చెప్పారు. అమరావతి కేంద్రంగా క్వాంటమ్‌ వ్యాలీ, విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో వందల ఎకరాల్లో గూగుల్‌ కంపెనీల రాకతో పారిశ్రామిక ప్రగతికి దోహదపడతాయని ఆమె  ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
దేశంలో ప్రైవేటీకరణ విధానం వల్లే స్టార్టప్‌ కంపెనీలు పలు రాష్ట్రాల్లో పెరిగాయని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత 2047 నాటికి వికసిత్‌ భారత్‌ దిశగా ఎపి సాగుతుందని, విశాఖ కేంద్రంగా జిసిసి ఆర్థిక ప్రగతికి, మానవాభివృద్ధికి దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
 
పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉందని, 2028 నాటికే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కూడా 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్‌ రూపొందించామని చెప్పారు. 
 
వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంట్రప్రెన్యూర్‌ నినాదంతో కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటంతో పాటు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఆలోచనలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 
 
వచ్చే ఏడాది ఆగస్టు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమరావతి నగరాన్ని గ్రీన్‌ ఫీల్డ్‌ నగరంగా నిర్మిస్తున్నామని, విజయవాడ- గుంటూరులను అనుసంధానిస్తున్నట్టు తెలిపారు. వచ్చే నెలలో విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటవుతుందని తెలిపారు.  టెక్నాలజీ పరంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, సంజీవని ప్రాజెక్టు ద్వారా బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి డిజిటల్‌ హెల్త్‌ రికార్డులను తయారు చేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు.