
నేపాల్ లో యువత చేపట్టిన ఆందోళనలు పెద్దఎత్తున హింసాత్మక సంఘటనలకు దారితీయడంతో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ ఆందోళనల సమయంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వెంటనే స్పందించాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సహాయ కేంద్రానికి ముగ్గురు సీనియర్ అధికారులను నియమించారు. వీరు అక్కడి తెలుగు ప్రజల సమస్యలను విని, అవసరమైన సహాయం అందించేందుకు సమన్వయం చేస్తున్నారు.
నేపాల్ రాజధాని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా ముందడుగు వేసింది. అక్కడ చిక్కుకున్న భారతీయులను సంప్రదించి భద్రత కల్పించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. +977 – 980 860 2881 +977 – 981 032 6134 నెంబర్లకు సాధారణ కాల్స్‌తో పాటు, వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చని సూచించింది.
అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని ఏపీ భవన్(AP Bhavan) లో హైల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. +91 9818395787,+918500027678, ఇమెయిల్: helpline@apnrts.com, info@apnrts.comను సంప్రదించాలని సూచించింది. ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల పౌరులెవరూ గాయపడినట్లు లేదా తప్పిపోయినట్లు సమాచారం లేదు.
మరోవైపు నేపాల్‌లో చిక్కున్న ఏపీ ప్రజలను రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలకు దిగారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నేపాల్‌లో చిక్కుకున్న ప్రజల సమాచారం గురించి అధికారులు లోకేశ్‌కు వివరించారు. పలువురు బాధితులతో కూడా ఆయన వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.
అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం నేపాల్‌లో 261 మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నట్లు అధికారులు లోకేశ్‌కు చెప్పారు. ఖాట్మండు నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి వాళ్ళని రప్పించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపు బాధ్యతలు కూడా ఆయన అధికారులకు అప్పగించారు. అలాగే ప్రతి రెండు గంటలకొకసారి బాధితులు సమాచారం గురించి తెలుసుకోవాలని సూచించారు.
సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అక్కడి తాజా పరిస్థితులపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో నిరంతరం సంప్రదిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ తెలుగువారు చిక్కుకుపోయినట్లు తెలిసిన వెంటనే రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవతో మాట్లాడారు. ప్రస్తుతం కాఠ్‌మండూలోని బఫాల్ ప్రాంతంలో 30 మంది తెలుగువారు ఎంబసీ ద్వారా సాయం పొందుతున్నట్లు వెల్లడించింది.
More Stories
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
ఈనెల 22న బీజేపీ రాష్ట్ర వ్యాప్త సంబరాలు
అనంతపూర్ లో కూటమి పార్టీల ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’సభ రేపే!